అగ్రరాజ్యంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. ఆయనపై ఉన్న నాలుగు కేసుల్లో ఒక దానికి సంబంధించి ఆయన అధికారుల ముందు లొంగిపోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన్ను అరెస్టు చేశారు. 20 నిమిషాల పాటు ఉన్న ఆయన.. అనంతరం వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రిగ్గింగ్.. కుట్ర అబియోగాలకు సంబంధించిన ఆరోపణల మీద ఆయన్ను అరెస్టు చేశారు.
ఈ తరహా ఆరోపణలు ఉన్న నేతలు లొంగిపోతుంటారు. ట్రంప్ అదే విధంగా వ్యవహరించారు. భారీ భద్రత మధ్య అట్లాంటా ఫుల్టన్ కౌంటీ జైలు వద్ద లొంగిపోయారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం జార్జియా జైల్ వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇప్పటికే ఆయన స్వయంగా పుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయారు. అనంతరం 2 లక్షల డాలర్లు విలువైన బాండ్ ను సమర్పించి బెయిల్ తీసుకొన్నారు. దీనికి అట్లాంటా పుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ అటార్ని అనుమతించటంతో.. అరెస్టు.. విడుదల కార్యక్రమం వెంట వెంటనే పూర్తి అయ్యాయి.
ఈ తరహా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు పోలీసుల ఎదుట లొంగిపోవటాన్ని కూడా అరెస్టుగానే పరిగణిస్తారు. దీంతో.. ట్రంప్ సైతం అరెస్టు అయినట్లే. ఆయనపై నమోదైన నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇదొకటి కాగా.. మిగిలిన మూడు కేసుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే.. తనపై నమోదైన ఆరోపణలన్ని సత్యదూరమని.. తాను ఏ తప్పు చేయలేదన్న ట్రంప్.. ఇలాంటి పరిణామం చోటు చేసుకోకూడదని.. ఇది అమెరికాకు విచారకరమైన రోజుగా అభివర్ణించారు. అరెస్టు అనంతరం విడుదలైన తర్వాత మీడియా వద్ద ముక్తసరిగా మాట్లాడిన ఆయన.. ‘అమెరికాకు విచాకరమైన రోజు. ఇది ఎప్పటికి జరగకూడదు’ అని పేర్కొన్నారు.