తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. పార్టీలతో పాటు నాయకులు ఎన్నికల్లో పోటీకి కసరత్తులు చేస్తున్నారు. టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ నాయకురాలు విజయశాంతి ఎక్కడి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది. విజయశాంతికి ప్రత్యేకంగా ఒక నియోజకవర్గమంటూ లేకపోవడమే అసలు సమస్య అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి బీజీపీ తరపున ఆమె పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే రాములమ్మకు అసలు బీజీపీ టికెట్ ఇస్తుందా అన్నది ఇక్కడ ప్రశ్న.
బీజేపీతోనే రాజకీయ జీవితం ఆరంభించిన రాములమ్మ.. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. దీన్ని అప్పటి టీఆర్ఎస్లో కలిపేశారు. 2009లో టీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీగా గెలిచారు. కానీ పార్టీ నుంచి సస్పెండ్ అవడంతో 2014లో కాంగ్రెస్లో చేరారు. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. చివరకు 2020లో తిరిగి కాషాయ కండువా కప్పుకున్నారు. కానీ బీజేపీలోకి మళ్లీ వచ్చినప్పటి నుంచి రాములమ్మకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్లో ప్రచార కమిటీ ఛైర్మన్గా ఉన్న ఆమెకు.. బీజేపీలో ప్రత్యేకంగా పదవి అంటూ ఏమీ లేదు. పైగా ఇటీవల మణిపూర్ ఘటనపై స్పందించి బీజేపీని ఇరకాటంలో పెట్టేలా ట్వీట్లు చేశారనే టాక్ ఉంది.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయ శాంతికి బీజేపీ టికెట్ ఇస్తుందా అన్నది ప్రశ్నార్థకం. ఒకవేళ టికెట్ ఇవ్వాలన్నా ఆమెకంటూ ఓ నియోజకవర్గం ఉండాలి కదా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక నియోజకవర్గంలో బలాన్ని పెంచుకోవడానికి ఆమె ఏ రోజు కూడా ప్రయత్నించలేదని తెలిసింది. ఇప్పుడేమో సడన్గా కూకట్ పల్లి అయితే సేఫ్ గా ఉంటుందని భావించిన ఆమె తరచుగా ఇక్కడ పర్యటిస్తున్నారని సమాచారం. ఇక్కడ నుంచే పోటీకి ఆమె సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మరి రాములమ్మకు కూకట్ పల్లిలో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇస్తుందా? లేదా? అన్నది చూడాలి.