గన్నవరంలో 2024లో యార్లగడ్డను గెలిపించి టీడీపీ కంచుకోట గన్నవరంలో పసుపు జెండా ఎగరేయాలని పార్టీ శ్రేణులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. గన్నవరం టీడీపీ ఇన్చార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావును నియమించామని, గన్నవరంలో పార్టీని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు లోకేష్. అయితే, లోకేష్ ప్రసంగిస్తుండగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో జై లోకేష్ అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ సెల్ ఫోన్ టార్చ్‌లు వేశారు.
ఈ సందర్భంగా జగన్ పై లోకేష్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగా చేయలేని ప్రిజనరీకి, విజనరీ చంద్రబాబుకు ఇదే తేడా అని లోకేష్ చురకలంటించారు. పిల్ల సైకో వంశీని రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించేందుకు కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గన్నవరంలో ప్రతీ కార్యకర్తను తాను కాపాడుకుంటానని భరోసానిచ్చారు. తన గెలుపు కోసం కష్టపడిన టీడీపీ శ్రేణులపైనే తప్పుడు కేసులు కేసి పెట్టించి వేధిస్తున్న వంశీపై మండిపడ్డారు. పట్టిసీమ లేకుంటే గన్నవరంలో బాత్రూమ్ కడిగేందుకు నీళ్లుండేవి కాదని వంశీ నటించారని గుర్తు చేశారు.
గన్నవరం పిల్ల సైకోకి ఓసారి ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా టీడీపీ బీ ఫామ్ ఇచ్చిందని లేదంటే ఆయన పేరు కూడా ఎవరికీ తెలీదని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో ఓటమే తనలో కసి పెంచిందని, ఇపుడు అది టీడీపీ కంచుకోటగా మారిందని అన్నారు. గన్నవరంలో పిల్ల సైకోని, గుడివాడలో సన్న బియ్యం సన్నాసిని ఓడించాలని వల్లభనేని వంశీ, కొడాలి నానిలపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్నవరం ఇన్‌ఛార్జ్‌గా బచ్చుల అర్జనుడు తన తుది శ్వాస వరకు అంకితభావంతో కృషి చేశారని కొనియాడారు. బచ్చుల అర్జునుడు కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.