టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోసాని నిన్న సంచలన కామెంట్లు చేశారు. కోర్టుకు హాజరయ్యే సందర్భంగా తనను చంపాలని ప్లాన్ చేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కంతేరులో లోకేష్ కు 14 ఎకరాల భూమి ఉందని గతంలో అన్న వ్యాఖ్యలపై లోకేష్ పరువు నష్టం దావా వేశారని, జగన్ ను లోకేష్ దూషిస్తున్న విధానం పై తాను కూడా పరువు నష్టం వేస్తానని, పోలీస్ కేసు పెడతానని పోసాని నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లోకేష్ పై పోసాని ఫిర్యాదు చేశారు. తను చంపేందుకు లోకేష్ కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదులో సంచలన విషయాలు పేర్కొన్నారు. తనను చంపేందుకు లోకేష్ స్కెచ్ వేస్తున్నారన్న సమాచారం తనకు ఉందని, తనకు రక్షణ కల్పించాలని డీజీపీని పోసాని కోరారు. తనకు భద్రత కల్పిస్తానని డీజీపీ హామీ ఇచ్చారని పోసాని వెల్లడించారు. తనను టీడీపీలో చేరాలని లోకేష్ కోరారని, కానీ, తాను అందుకు సుముఖంగా లేనని చెప్పడంతో లోకేష్ ఇగో హర్ట్ అయిందని పోసాని ఆరోపణలు చేశారు.
తన హత్యకు కుట్ర జరుగుతుందని తనతో కొందరు చెప్పారని, అందుకే అలర్ట్ అయ్యానని లోకేష్ అన్నారు. లోకేష్ అక్రమాస్తుల బండారాన్ని బయటపెట్టింది తానేనని, అందుకే తనను టార్గెట్ చేశారని పోసాని ఆరోపించారు. లోకేష్ అందరినీ బట్టలు విప్పి కొడతానని అంటుంటారని, బట్టల మీద కొట్టొచ్చు కదా అని ఎద్దేవా చేశారు. సీఎం పదవిపై తనకు మోజు లేదని చంద్రబాబు అంటున్నారని, అటువంటప్పుడు పవన్ ను సీఎం చేస్తానని చంద్రబాబు చెప్పొచ్చు కదా అని ప్రశ్నించారు. తనకు జగన్ అంటే ప్రేమ, పిచ్చి అని పోసాని వ్యాఖ్యానించారు.