తమ అత్యుత్సాహం.. మొరటుతనం.. దూకుడు పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందన్న విషయాన్ని మర్చిపోతున్న కొందరు వైసీపీ నేతల తీరు తరచూ వార్తలుగా మారుతున్నాయి. వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా జెడ్పీ ఉపాధ్యక్షురాలు అరుణ భర్త.. వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యన్నా బత్తిన వెంకటేశ్వరరావు రెచ్చిపోయిన వైనం షాకింగ్ గా మారింది.
తన వారిపై పేకాట కేసులు పెడతావా? అంటూ స్టేషన్ ముందు కుర్చీ వేసుకొని సెబ్ ఎస్ఐపై తిట్ల పురాణం విప్పిన వైనం స్థానికంగా సంచలనంగా మారింది. ‘మా వాళ్ల మీదనే పేకాట కేసులు పెడతావా? డబ్బులు సీజ్ చేసి కోర్టులో కేసు వేస్తావా?’ అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన.. నువ్వు ఏమైనా పెద్ద పుడింగి అనుకుంటున్నావా? నీ సంగతి తేలుస్తానంటూ స్టేషన్ ఎదుట కుర్చీలు వేసుకొని మరీ ఎస్ఐను తిట్టేయటం సంచలనంగా మారింది.
ఈ నెల 19న పాతసింగరాయకొండ వద్ద పొలాల్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి చేసిన సెబ్ ఎస్ఐ దయాకర్ తన సిబ్బందితో కలిసి రైడ్లు నిర్వహించారు. అక్కడ పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రూ.1.55 లక్షలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. దీనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వెంకటేశ్వరరావు.. ఎస్ఐను బూతులు తిడుతూ.. స్టేషన్ ఎదుట చేసిన రచ్చ సంచలనంగా మారింది.
తన మనుషులనే అరెస్టు చేసే ధైర్యమా నీకు? అంటూ సీరియస్ అవుతూ రాయలేని తిట్లను తిట్టేసిన వైనం ఒక ఎత్తు అయితే.. ‘‘నీ ఉద్యోగం తీసేయిస్తా. హిజ్రాలతో దాడి చేయిస్తా’’ అంటూ హెచ్చరికలు చేయటం గమనార్హం. తన అనుచరులతో కుర్చీలు వేసుకొని మరీ వీరంగం వేసిన ఆయన తీరు.. పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ పని తాము చేస్తే ఇలా తిట్టేయటం.. బెదిరింపులకు దిగటం ఏమంటూ ఎస్ఐ దయాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన నేత వీరంగం వేసిన సమయంలో సీఐ.. ఎస్ఐలు స్టేషన్ వద్ద లేకపోవటం గమనార్హం.