తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని మార్పులు చేర్పులు మినహా దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం ఇచ్చారు కేసీఆర్ అయితే, కేసీఆర్ ప్రకటించిన మొత్తం స్థానాలలో కేవలం ఎనిమిది మాత్రమే మహిళలకు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మహిళా రిజర్వేషన్ అని, మహిళల హక్కుల కోసం పోరాటం అని కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో పోరాటం చేశారని, ఇప్పుడు పార్టీ టికెట్లు ఇచ్చేటప్పుడు మాత్రం మహిళలకు అన్యాయం జరిగినా కవిత నోరు మెదపడం లేదని విమర్శలు వస్తున్నాయి.
మహిళలకు 33% రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో పోరాడిన కవిత 119 స్థానాలకు గాను 8 స్థానాలను మహిళలకు కేటాయించిన తన తండ్రిని నిలదీయగలరా అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు కవితను ప్రశ్నిస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు అంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర దొంగ దీక్షలు చేశారంటూ కవితపై పరోక్షంగా తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇక, తెలంగాణ మహిళలకు కవిత క్షమాపణలు చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ కూడా డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ లో కవిత పేరు వచ్చిందని, దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆనాడు మహిళా రిజర్వేషన్ అంటూ కవిత డ్రామా ఆడారని రాణి రుద్రమ విమర్శించారు.
ఆనాడు ఢిల్లీ రోడ్లపై ధర్నా చేసిన కవిత ఈనాడు ప్రగతి భవన్ ముందు ఎందుకు ధర్నా చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. అయితే. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా చూసి బీజేపీ భయం పట్టుకుందని కవిత కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాల రాజకీయ అభద్రతను మహిళా ప్రాధాన్యతతో ముడి పెట్టవద్దని కవిత చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మహిళలకు ఎన్ని సీట్లు కేటాయిస్తాయో వేచి చూద్దామని కవిత ఆ విమర్శలను తిప్పికొట్టారు.