అతడు అమెరికాలో 15 ఏళ్లపాటు ఉన్నాడు…రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలని ఇండియాకు తిరిగి వచ్చాడు…అతడిని క్రాస్ రోడ్ లో వదలను అని వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చారు..గత ఎన్నికల్లో అతడు వైసీపీ తరఫున పోటీ చేసి పార్టీ కోసం సర్వశక్తులు ఒడ్డాడు…అయితే, టీడీపీ అభ్యర్థి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు…సీన్ కట్ చేస్తే…గత ఎన్నికల్లో తన ప్రత్యర్థి అభ్యర్థి వచ్చి తన పార్టీలో చేరాడు.
దీంతో, పార్టీకి అతడు పరాయివాడయ్యాడు…ఇదేంటి అని ప్రశ్నిస్తే…పార్టీలో ఉంటే ఉండు…పోతే పో అని పెద్దలు సమాధానమిచ్చారు….అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు..అతడిని చేరదీశారు…పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తానని భరోసానిచ్చారు…దీంతో, ఆ వ్యక్తి ఈ రోజు టీడీపీలో చేరారు. ఇన్ని అవమానాలు పొందిన ఆ వ్యక్తి గన్నవరానికి చెందిన వైసీపీ మాజీ నేత యార్లగడ్డ వెంకట్రావు.
చంద్రబాబు ఓకే అంటే…గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పోటీకి సరైనోడు దొరికాడు. ఊహించినట్లుగానే గన్నవరం నియోజకవర్గం నిడమనూరులో లోకేష్ పాదయాత్ర సందర్భంగా వెంకట్రావు టీడీపీలో చేరారు. వెంకట్రావుకు పసుపు కండువా కప్పి పార్టీలోకి లోకేష్ ఆహ్వానించారు. టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, పంచుమర్తి అనురాధ, వంగవీటి రాధా తదితరుల సమక్షంలో ఆయన సైకిల్ ఎక్కారు. యార్లగడ్డ చేరికతో గన్నవరం టిడిపి బలపడిందనడంలో సందేహం లేదు.
గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీని ఢీ అంటే ఢీ అనే నాయకుడిగా యార్లగడ్డ తెరపైకి వచ్చారు. అధినేత చంద్రబాబు ఆదేశిస్తే గన్నవరం…గుడివాడ..బెజవాడ…రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేస్తానని యార్లగడ్డ అన్న సంగతి తెలిసిందే. అయితే, దాదాపుగా గన్నవరం టికెట్ యార్లగడ్డకు ఖాయమైందన్న టాక్ వస్తోంది. ఏది ఏమైనా…మరికొద్ది రోజుల్లో యార్లగడ్డ తరహాలో మరింత మంది వైసీపీ నేతలు సైకిల్ ఎక్కడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.