ఆంధ్రప్రదేశ్లో తాజాగా వెల్లడైన పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీ కి మేలుకొలుపా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. సర్పంచులు, వార్డు సభ్యులకు జరిగిన ఉప ఎన్నికల్లో గతంతో పోలిస్తే వైసీపీకి సీట్లు తగ్గడమే అందుకు కారణమని చెబుతున్నారు. ఇదే సమయంలో మరోవైపు టీడీపీ పార్టీకి ఎక్కువ స్థానాలు దక్కడం కూడా ఇక్కడ కీలకాంశంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా 34 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఇందులో వైసీపీ మద్దతుదారులు 22 స్థానాల్లో గెలిచారు. ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి ఓ చోట నెగ్గారు. ఇక టీడీపీ మద్దతుదారులు 9, టీడీపీ, జనసేన కలిపి 2 స్థానాలను దక్కించుకున్నాయి. గతంతో పోలిస్తే వైసీపీ గెలిచిన ఏడు సర్పంచ్ స్థానాలను ఇప్పుడు టీడీపీ దక్కించుకోవడం విశేషం.
ఇక వార్డు సభ్యుల ఫలితాలు చూస్తే మొత్తం 243 వార్డులకు గాను వైసీపీ 141, టీడీపీ 90, జనసేన 5, వైసీపీ తిరుగుబాటు అభ్యర్థులు 2, టీడీపీ, జనసేన కలిపి 1, సీపీఎం ఒకటి, ఇతరులు మూడు స్థానాల్లో గెలిచారు. ఈ ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందనే ఆరోపణలున్నాయి. వాలంటీర్లతో ప్రచారం నిర్వహించడం ఎన్నికల సంఘం ఆదేశాలకు విరుద్ధమైన వైసీపీ పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ఇంత చేసినా గతంతో పోలిస్తే వైసీపీకి సీట్లు తగ్గడం, టీడీపీకి పెరగడం గమనార్హం. వరుసగా రెండోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న జగన్కు ఇది మింగుడుపడడం లేదని తెలుస్తోంది.