తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుగాలి వీచిన సంగతి తెలిసిందే. వైసీపీకి గట్టి పోటీ ఇచ్చిన టీడీపీ చాలా స్థానాలను కైవసం చేసుకోవడంతో అధికార పార్టీ ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ కు పరాభవం తప్పదని ఆయన జోస్యం చెప్పారు.
అంతేకాదు, తన సొంత ఇలాకా పులివెందులలో కూడా జగన్ ఓటమిపాలవడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేశారు తులసిరెడ్డి. కొద్దిరోజుల క్రితం జరిగిన శాసనమండలి ఎన్నికల ఫలితాలే వైసీపీపై వ్యతిరేకతకు ఉదాహరణ అని తులసి రెడ్డి చెప్పారు. వైసీపీని ఓడిస్తే రాష్ట్రం, బీజేపీని ఓడిస్తే దేశం రెండు సుభిక్షంగా ఉంటాయని తులసిరెడ్డి అన్నారు. 2019 ఎన్నికల ప్రకారం జగన్ సీఎం కాకముందే దేశంలోని సీఎంల కంటే ధనవంతుడని అన్నారు.
370 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్ లో జగన్ పేర్కొన్నారని గుర్తు చేశారు. ఇక, వైసీపీకి చెందిన 9 మంది రాజ్యసభ సభ్యులు కూడా కోటీశ్వరులని, వారిలో నలుగురు బిలియనీర్లు కూడా ఉన్నారని తులసి రెడ్డి అన్నారు. అయినా, తనది పేదల పార్టీ అని, తమ పార్టీ పేదల పక్షం అని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇసుకతో సహజ వనరులన్నీ దోచేస్తున్నారని ఆరోపించారు. సొంత చెల్లెలు వైఎస్ షర్మిల, వైఎస్ సునీతకు న్యాయం చేయలేని జగన్….మహిళా సాధికారతకు కృషి చేస్తానని హామీలు ఇస్తుండటం నమ్మశక్యంగా లేదని ఎద్దేవా చేశారు.