ప్రస్తుతం తెలుగు వారికి అత్యంత ఇష్టమైన పర భాషా నటుల్లో దుల్కర్ సల్మాన్ ఒకడు. మలయాళ లెజెండరీ నటుడైన మమ్ముట్టి తనయుడైన దుల్కర్.. తండ్రి పేరును పెద్దగా ఉపయోగించుకోకుండానే బహు భాషల్లో మంచి పేరు, ఫాలోయింగ్ సంపాదించాడు. ఓకే బంగారం డబ్బింగ్ వెర్షన్‌తోనే కాక మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడతను. ఇటీవలే వెంకీ అట్లూరి దర్శకత్వంలో అతనో పాన్ ఇండియా సినిమాను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
ఇది కాక ప్రభాస్ మూవీ కల్కి 2898 ఏడీలోనూ దుల్కర్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు కొన్ని రోజులుగా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. కానీ దీని గురించి అధికారిక సమాచారం ఏదీ బయటికి రాలేదు. ఐతే తన కొత్త చిత్రం కింగ్ ఆఫ్ కోతా ప్రమోషన్లలో భాగంగా తాను కల్కిలో నటిస్తున్నట్లు చూచాయిగా చెప్పేశాడు దుల్కర్.
ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘కల్కి 2898 ఏడీ’లో నటిస్తున్నారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు దుల్కర్ నవ్వుతూ సమాధానం దాట వేశాడు. ఆ విషయం దర్శకుడు నాగ్ అశ్వినే చెప్పాలని అతనన్నాడు. కానీ అతను నవ్విన నవ్వుతోనే విషయం అర్థమైపోయింది. ‘‘నేను ‘కల్కి 2898 AD’ సినిమాలో నటిస్తున్నానా? లేదా? అనే విషయాన్ని ఇప్పుడప్పుడే చెప్పలేను. కానీ ‘కల్కి’ సినిమా సెట్‌కి వెళ్లినప్పుడు చూసి ఆశ్చర్యపోయా.
కేవలం నాగీ మాత్రమే అంత గొప్ప సినిమా తీయగలరు. అలాంటి ఆలోచనలు నాగీకి మాత్రమే వస్తాయి. అతను తీసిన మొదటి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’కు, రెండో చిత్రం మహానటి’కి అస్సలు సంబంధం ఉండదు. ఇప్పుడు రాబోయే ‘కల్కి’ కూడా చాలా కొత్తగా ఉంటుంది. భవిష్యత్తును చెప్పే కథగా నాగీ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు’’ అని దుల్కర్ అన్నాడు. తన మాటలు బట్టి చూస్తే దుల్కర్ కల్కిలో ఉన్నట్లే. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రలు పోషిస్తన్న సంగతి తెలిసిందే.