టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర తాడేపల్లిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే తాడేపల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి ఈ రోజు పాదయాత్ర మొదలైంది. ఈ సందర్భంగా లోకేష్ కు ఘన స్వాగతం చెబుతూ తాడేపల్లి, అమరావతి, ఉండవల్లి లోని టీడీపీ శ్రేణులు భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేశాయి. అయితే, కొందరు వైసిపి శ్రేణుల ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది, పోలీసులు వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
దీంతో, ఈ వ్యవహారంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీ నేతల సూచనల ప్రకారమే లోకేష్ ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగిస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ఏ అధికారికి ఫోన్ చేసినా వారు ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఫ్లెక్సీల పై ఏ ఒక్క వైసీపీ నేత కార్యకర్త చేయి వేసినా వారి సంగతి చూస్తామంటూ వెంకన్న వార్నింగ్ ఇచ్చారు. లోకేష్ వెళ్ళిపోయేంతవరకు ఫ్లెక్సీలు ఉండాల్సిందేనని, ఎవరైనా తొలగించాలని చేయి వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఘాటుగా హెచ్చరించారు.
మరోవైపు, ఈ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు గుంటూరు నుంచి ఎన్టీఆర్ జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలోనే రాజధాని ప్రాంతం కావడంతో లోకేష్ పాదయాత్రకు తీవ్ర ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు, నంద్యాలకు చెందిన హుస్సేన్ బి అనే ముస్లిం వృద్ధురాలి హజ్ యాత్రకు ఆర్థిక సాయం చేస్తానని లోకేష్ గతంలో మాట ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా లక్షన్నర రూపాయల చెక్ ను లోకేష్ పంపించారు.