టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర త్వరలోనే రెండు కీలక నియోజకవర్గాల్లోకి అడుగులు వేయనుంది. ప్రస్తుతం మంగళగిరి శివారులో సాగుతున్న పాదయాత్ర ప్రకాశం బ్యారేజీ మీదుగా(అనుమతిస్తే) లేదా.. కనకదుర్గమ్మ వారధిపై నుంచి(అప్పట్లో జగన్ పాదయాత్ర చేసినప్పుడు ప్రకాశం బ్యారేజీపై అనుమతి ఇవ్వలేదు) విజయవాడ బోర్డర్లోకి ఈ పాదయాత్ర అడుగులు వేయనుంది.
అనంతరం.. విజయవాడ పార్లమెంటు పరిధిలోని తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల మీదుగా.. ఉమ్మడి కృష్ణాలోని గన్నవరం నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగు పెట్టనుంది. ఇది టీడీపీకి అత్యంత కీలక మైన నియోజకవర్గం. గతంలో ఇక్కడ పలుమార్లు విజయం దక్కించుకున్న టీడీపీ నాయకుడు వల్లభనేని వంశీ.. గత ఎన్నికల అనంతరం వైసీపీకి దన్నుగా మారారు. ఇక, ఆ తర్వాత.. చంద్రబాబు ఫ్యామిలీపైనా ఆయన విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో సాక్షాత్తూ నారా లోకేష్ ఈ నియోజకవర్గంలో అడుగులు వేయనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో వంశీని ఎట్టి పరిస్థితిలోనూ ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్న నారా లోకేష్ తన అస్త్ర శస్త్రాలను ప్రయోగించి.. వంశీకి బలమైన కామెంట్లతో పంచ్‌లు విసరడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
టీడీపీలోనే ఓనమాలు నేర్చుకున్న వంశీ.. ఇప్పుడు వైసీపీకి మద్దతుగా మారి.. తమపైనే దాడులు చేయడాన్ని నారా లోకేష్ సీరియస్‌గా తీసుకున్న దరిమిలా.. ఇప్పుడు పాదయాత్ర ద్వారా గన్నవరం ఎమ్మెల్యేకి ఆయన భారీ షాక్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.