సమయం, సందర్భం లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మరీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై నటుడు, దర్శకుడు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటారు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కంతేరులో లోకేష్ 14 ఎకరాల భూములు కొనుగోలు చేశారని పోసాని గతంలో ఆరోపించారు. దీంతో ఆ వ్యాఖ్యలపై లోకేష్ స్పందించి…పోసాని క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులు పంపించారు.
అయితే రెండు సార్లు లీగల్ నోటిలో పంపినా పోసాని నుంచి స్పందన రాకపోవడంతో గతంలోనే పోసానిపై లోకేష్ పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరై లోకేష్ తన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. తనపై బురదజల్లితే ఊరుకుంటానని అనుకోవద్దని లోకేష్ హెచ్చరించారు. నిరాధార ఆరోపణలు చేసిన వారిని న్యాయస్థానానికి ఈడ్చి కేసులు పెడతానని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. కోర్టుకు హాజరవుతున్నందున ఆగస్టు 18న పాదయాత్రకు లోకేష్ విరామం ప్రకటించారు.
ఇక, ఆగస్టు 19వ తేదీ నుంచి ఉండవల్లి లోని చంద్రబాబు నివాసం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడ నగరంలోనికి లోకేష్ పాదయాత్ర శనివారం అడుగుపెట్టనుంది. అంతకుముందు నులకపేటలో పాదయాత్ర సందర్భంగా ఫిష్ ఆంధ్రా మార్ట్ వద్ద జగన్ కు లోకేష్ సెల్ఫీ చాలెంజ్ చేశారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం చేతగాని జగన్ చేపలు, మాంసం అందించేందుకు దుకాణాలు పెట్టించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో కియా, టిసిఎల్, ఫాక్స్ కాన్, సెల్కాన్ వంటి సంస్థలు లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాయని, విధ్వంసకుడికి, విజనరీకి ఉన్న తేడా ఇది అని అన్నారు. టిడిపిది హ్యూమనిజం, వైసిపిది ఫ్యాక్షనిజం అని లోకేష్ చెప్పారు.