అమెరికా అధ్యక్ష పీఠం మీద మరోసారి కూర్చునేందుకు తహతహలాడుతున్న డొనాల్డ్ ట్రంప్ కు వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే మూడు తీవ్రమైన అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. తాజాగా మరో అభియోగాన్ని ఫుల్టన్ కౌంటీ గ్రాండ్ జ్యూరీ పొందుపర్చింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన జార్జియా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల్ని తారుమారు చేసేందుకు ట్రంప్ ప్రయత్నించారన్నది ఆయన మీద ఉన్న ఆరోపణ.
తాజా కేసులో ట్రంప్ తో పాటు మరో పద్దెనిమిది మంది మీదా అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనపై 41 చార్జ్ అభియోగపత్రాన్ని నమోదు చేశారు. ఇందులో భాగంగా ఆగస్టు 25 లోపు అభియోగాలు నమోదైన పందొమ్మిది మంది స్వచ్ఛందంగా సరెండర్ కావాలని ఫుల్టన్ కౌంటీ జిల్లా మహిళా అటార్నీ ఫ్యానీ విల్లీస్ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ట్రంప్ తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ట్రంప్ మాజీ న్యాయవాది.. వైట్ హౌస్ మాజీ చీఫ్ ఆఫ్ స్టాప్ మార్క్ మిడోస్ తో పాటు.. అమెరికా అధ్యక్ష భవనానికి న్యాయవాదిగా వ్యవహరించిన మాజీ అధికారి.. న్యాయశాఖకు చెందిన మాజీ ఉన్నతాధికారితో పాటు పలువురు ఉన్నత ఉద్యోగులు ఉన్నారు.
ఈ అభియోగాల మీద ట్రంప్ విరుచుకుపడుతున్నారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి కేసుల్ని తెర మీదకు తీసుకొస్తున్నట్లుగా ఆరోపించారు. అయితే.. అధికారపక్షం మాత్రం ఈ అభియోగాలను సమర్థిస్తోంది. తాజాగా తెర మీదకు వచ్చిన అంశాలు.. ఎన్నికల వేళలో ఫలితాల్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు బట్టబయలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ట్రంప్ ను అష్టదిగ్బంధనం చేసేలా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని ఆయన అభిమానులు మండిపడుతున్నారు.