తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ది దిక్కుమాలిన పాలన అని, ప్రభుత్వ భూములు అమ్మి నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. వందలాది మంది అమరవీరుల ప్రాణ త్యాగంతో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని, అటువంటి రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైన్ షాపులు, బార్లు, పబ్బులు విచ్చలవిడిగా ఉన్నాయని ఆరోపించారు.
ఒక్కమాటలో చెప్పాలంటే బళ్ళు, గుళ్ల కంటే అవే ఎక్కువగా కనిపిస్తున్నాయని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో పట్టపగలు మహిళలు రోడ్లమీద తిరిగే పరిస్థితి లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడక ముందు కంటే ఏర్పడిన తర్వాత మద్యం అమ్మకాలు 10రెట్లు పెరిగాయని, మద్యం అమ్మి కేసీఆర్ ప్రభుత్వం నడుపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చినా ఒక్క హామీ నిలబెట్టుకోని ఘనత కేసీఆర్ దేనిని చురకలంటించారు.
ఆనాడు తెల్లదొరలు దేశాన్ని దోచుకున్నారని, ఈనాడు నల్లదొర కేసీఆర్ వారి మాదిరిగా పాలన చేసి తెలంగాణను దోచుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నియంత పాలన పోతేనే తెలంగాణకు అసలు శిసలు స్వాతంత్ర్యం వచ్చినట్లు అని షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. బ్రిటిష్ వాళ్ల మాదిరికగా కేంద్ర ప్రభుత్వం డివైడ్ అండ్ రూల్ పద్ధతి పాటిస్తోందని, మణిపూర్ మత ఘర్షణలే ఇందుకు కారణని అన్నారు. పొత్తులు, లేదా పార్టీ విలీనంపై వారంలో కీలక నిర్ణయం వెల్లడిస్తానని…ఆ రెండింటిలో ఏది జరిగినా..కార్యకర్తలు, నేతల వెన్నంటే తాను ఉంటానని షర్మిల భరోసానిచ్చారు.
కాగా, షర్మిల చేపట్టిన ‘ప్రజాప్రస్థానం పాదయాత్ర’కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. 3,800 కిలో మీటర్ల పాదయాత్ర చేసిన మొదటి మహిళగా షర్మిల రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు షర్మిలను కలిసి అవార్డును అందజేశారు.