ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నియోజకవర్గంలో ఒక్కడే ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నాడు“ అంటూ.. స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. ఈ అక్రమాలు ఆపాలని.. లేకపోతే. 24 గంటల్లో తాము కూడా అక్రమాలకు పాల్పడతామని.. తాము కూడా ఇసుకను ఎవరికీ చెప్పకుండానే .. ఎలాంటి పత్రాలు చూపకుండానే తోలుకుంటామని సీఎం జగన్ కు అల్టిమేటం జారీ చేశారు.
తాజాగా తాడిపత్రిలో జరిగిన కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ.. టీడీపీకి కార్యకర్తల బలం ఉందని.. నాయ కుల మాట ఎలా ఉన్నా.. కార్యకర్తలు ఎందుకైనా తెగించేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి(స్థానిక ఎమ్మెల్యే) రోజు 1000 లారీల ఇసుక తోలుతున్నాడని.. ఎన్నికలకు ముందు ఎంత ఆస్తి ఉందో.. చెప్పాలని.. ఇప్పుడు 2 వేల కోట్ల కు పైగా పడగలెత్తాడని జేసీ విమర్శించారు.
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని, లేకపోతే ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుకపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే తామే ఇసుకను తోలుకుంటామని అన్నారు.
మాధవ్‌కు టికెట్ అందుకేనా?
అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్‌కు టికెట్ఎలా ఇచ్చారో తమకు తెలుసునని జేసీ వ్యాఖ్యానించారు. జేసీ దివాకర్‌రెడ్డి(అప్పట్లో ఎంపీ)ని అమ్మనా బూతులు తిట్టారనే కారణంగా.. జేసీలను అణిచివేయాలనే ఉద్దేశంతోనే ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారని జేసీ ఆరోపించారు. ఇప్పుడు ఇదే బాటలో డీఎస్పీ కూడా ఉన్నాడా? అని ప్రశ్నించారు. ఆయన తమను ఎంత ఇబ్బందికి గురి చేస్తే.. అంతగా జగన్ దగ్గర మార్కులు వేయించుకుంటున్నాడని జేసీ అన్నారు.