ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వం మరోసారి మాట మార్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన నేపథ్యంలో రుషికొండ విషయంలో తాజాగా చేసిన ప్రకటనే అందుకు కారణం. రుషికొండపై నిర్మాణంలో ఉన్నది ఏపీ సచివాలయమని తాజాగా వైసీపీ అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించారు. ఇప్పుడిది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇన్ని రోజులు ఈ కొండపై ప్రభుత్వ భవనాలు, సీఎం కార్యాలయం నిర్మిస్తున్నారని చెబుతూ వచ్చిన వైసీపీ ఇప్పుడు మాట మార్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా మారుస్తానని ప్రకటించిన సీఎం జగన్.. త్వరలోనే అక్కడికి మకాం మార్చేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం జగన్ను అనుకూలంగా ఉండేలా రుషికొండపై నిర్మాణలు చేపడుతున్నారనే ఆరోపణలున్నాయి. కానీ కొండపై జగన్రెడ్డి సీఎం కార్యాలయం కట్టుకుంటున్నారని, ఇందులో తప్పేం ఉందని వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ తరచూ చెబుతూనే ఉన్నారు. మరోవైపు ఇక్కడ టూరిజం ప్రాజెక్టు పేరుతో నిధులు మంజూరు చేసి నిర్మాణలు చేపడుతున్నారని తెలిసింది. కానీ ఇప్పుడేమో సచివాలయమని వైసీపీ చెబుతోంది.
గత కొంతకాలంగా రుషికొండపై యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనలో భాగంగా రుషి కొండ దగ్గరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. దీంతో ఇప్పుడు అక్కడ కడుతున్నది సచివాలయమంటూ వైసీపీ మాట మార్చిందని చెబుతున్నారు. కానీ సచివాలయం అంటే భారీ స్థాయిలో నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలను చూస్తే అలా అనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మరి వైసీపీ ఈ దొంగ మాటలు ఎందుకు చెబుతున్నట్లు అని విశ్లేషకులు అంటున్నారు.