2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు నుంచి లోక్సభ సభ్యుడిగా ఆ వైసీపీ నాయకుడు గెలిచారు. ఎంపీగా హోదా దక్కించుకున్నారు. రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఎలాంటి అధికారం లేదని.. ఏం చేయలేకపోతున్నాననే నిరాశతో రాజకీయాలకే దూరం కావాలని అనుకుంటున్నారని తెలిసింది. ఆ నాయకుడే కోటగిరి శ్రీధర్. ప్రస్తుతం ఆయన తీవ్ర రాజకీయ నిరాశలో ఉన్నట్లు సమాచారం.
వైసీపీలో తాను అనుకున్నట్లు ఏం జరగకపోవడంతో శ్రీధర్ అసహనంతో ఉన్నట్లు టాక్. లోక్సభ పరిధిలో ఎంపీగా తన ఉనికే లేదని ఆయన బాధపడుతున్నట్లు తెలిసింది. అన్నీ ఎమ్మెల్యేలే చూసుకుంటున్నారని, వీళ్ల ఆధిపత్యమే సాగుతుందని శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో అసలు పోటీ చేయకుండా ఉండాలనే ఆలోచన కూడా చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
శ్రీధర్ తండ్రి, దివంగత విద్యాధరరావు అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. 2008లో ప్రజారాజ్యంలో చేరారు. కానీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో చిరంజీవితో పాటే విద్యాధరరావు కొనసాగారు. ఆయన చనిపోయిన తర్వాత తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ శ్రీధర్ రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో వైసీపీ తరపున ఏలూరు ఎంపీగా గెలిచారు. ఎంపీగా గెలిచినా తనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఎంపీగా ఎలాంటి గుర్తింపు, పనే లేనప్పుడు ఇక రాజకీయాల్లో ఎందుకు ఉండడం అని ఆయన అనుకుంటున్నారని సమాచారం. మరి చివరకు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.