మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ కి చెందిన కాపు నాయకులు, మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు కూడా క్యూ కట్టుకుని విరుచు కుపడ్డారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘మీరు గిల్లితే ఎదుటివారూ గిల్లుతారు. అది చూడలేకపోతున్నానని బాధపడితే కుదరదు’ అంటూ కాపు నేత, మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ప్రస్తుత మంత్రి, కాపు నాయకుడు గుడివాడ అమర్నాథ్ కూడా ఇదే ధోరణిలో మాట్లాడారు. బొత్స సత్యనారాయణ కూడా `పిచ్చుక` వ్యాఖ్యలతో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
“సినిమాల్లోకి రాజకీయాలను లాగొద్దని అన్నట్లు నాకు తెలిసింది. అది మాకంటే ముందు ఆ మురికి మాటలు మాట్లాడిన వారి తమ్ముడికి చెప్పి ఉంటే బాగుండేది. ఆ తర్వాత మాకు, మా ప్రభుత్వానికి, మా రాజకీయ పార్టీలకూ సలహా ఇస్తే ఇంకా బాగుంటుంది“ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ‘‘హైదరాబాద్ ఫిలింనగర్ నుంచి ఏపీ సచివాలయానికి ఎంత దూరమో.. ఇక్కడి నుంచి అక్కడికీ అంతే దూరం. అదేదో సినిమాలో ‘గిచ్చితే గిల్లించుకోవాలి’ అనే డైలాగ్ ఉంది. అది సినిమాలో బాగుంటుందని కానీ, నిజ జీవితంలో నువ్వు గిల్లితే, ఎదుటి వారూ గిల్లుతారు“ అని మాజీ మంత్రి పేర్ని అన్నారు.
‘మా అబ్బాయినో, అమ్మాయినో తిడుతుంటే చూడలేకపోతున్నా’ అనడం కుదరదు. విలన్ను హీరో తిడుతుంటే చూడటానికి సినిమాల్లోనే బాగుంటుంది’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మాట్లాడుతూ.. ‘సినిమాల్లోకి రాజకీయాలను లాగొద్దని చిరంజీవి అన్నట్లు తెలిసింది. అది మాకంటే ముందు ఆ మురికి మాటలు మాట్లాడిన వారి తమ్ముడికి(పవన్) చెప్పి ఉంటే బాగుండేది. ఆ తర్వాత మాకు, మా ప్రభుత్వానికి, మా రాజకీయ పార్టీలకూ సలహా ఇస్తే ఇంకా బాగుంటుంది“ అని అన్నారు.