ఏపీ సీఎం జగన్కు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు అదిరిపోయే సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పర్యటిస్తున్న చంద్రబాబు.. గత తన హయాంలో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు సహా చింతలపూడి ఎత్తిపోతల పథకాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్కు సెల్ఫీ చాలెంజ్ రువ్వారు. “ చింతలపూడి ఎందుకు పూర్తి చేయలేక పోయారో చెప్పాలి“ అని సీఎం జగన్ ని చంద్రబాబు డిమాండ్ చేశారు.
చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద సెల్ఫీ తీసుకుని.. సీఎం జగన్కు సవాల్ విసిరారు. తమ ప్రభుత్వ హయాంలో 4,909 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. “మొత్తం 2,289 కోట్లు ప్రాజెక్టు కోసం ఖర్చు చేశాం. ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టు రూపకల్పన చేశాం. 53 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించేలా ప్రణాళిక చేశాం. కొంత పూర్తి కూడా చేశాం. ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది“ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఎందుకు నిలిపివేశారో చెప్పాలంటూ.. నిలదీశారు.
దేశంలో ఇది అద్భుతం!
మరోవైపు పట్టిసీమ ప్రాజెక్టు వద్ద పర్యటించిన చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును దేశంలోనేఅద్భుతమైన ప్రాజెక్టుగా అభివర్ణించారు. “దేశంలో పట్టిసీమలాంటి పెద్ద ప్రాజెక్టు లేదు. ఏపీలో వస్తుందన్న నమ్మకం లేదు. అటువంటి కీలకమైన ప్రాజెక్టుని జగన్ అనే దుర్మార్గుడు నిర్వీర్యం చేశాడు. చేతకాని పాలనతో పట్టిసీమకు ఎంతో నష్టం వచ్చింది“ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేథావులు, ప్రజలు, రైతుల్లో అవగాహన తీసుకురావడానికే తను సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధ భేరి మోగించినట్టు తెలిపారు.
“కరువు నివారించడానికి కాటన్ దొర ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారు.. అందుకే ఆయన విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారు. రాష్ట్రంలో అయిదు ప్రధాన నదులు, 69 ఉపనదులు ఉన్నాయని.. దేశంలో ఎక్కడా లేని నీళ్లు ఏపీలో ఉన్నాయి. వాటిని సక్రమంగా వినియోగిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది“ అని చంద్రబాబు అన్నారు. ఆ దిశగా తాము పనిచేశామని.. కానీ, ఇప్పుడు ఇలాంటి దశ-దిశ పోయి.. ప్రాజెక్టులను ముంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.