ఒకవైపు ఉద్రిక్తత కొనసాగుతున్న క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు తన పర్యటనను కొనసాగించా రు. ఈ క్రమంలో చంద్రబాబు రోడ్ షోలో మాట్లాడుతూ.. పుంగనూరుకు పెద్దిరెడ్డి ఏమైనా పుడింగా అని మండిపడ్డారు. రోడ్ షోలో తనని రావొద్దనటానికి ఈ రహదారి పెద్దిరెడ్డి తాత జాగీరా అని నిలదీశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ పర్యటన సాగింది.
పుంగనూరులోకి చంద్రబాబు వెళ్లకుండా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడం ఘర్షణలకు దారి తీసింది. పలు వాహనాలు ధ్వంసం కాగా, టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. అనంతరం చంద్రబాబు పుంగనూరు బైపాస్ కూడలి వద్దకు చేరుకుని కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.
“ఇవాళ జరిగిన విధ్వంసానికి మంత్రి పెద్దిరెడ్డి, పోలీసులే కారణం. విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఈ దారిలో వెళ్లకూడదా? ఈ రహదారి మంత్రి పెద్దిరెడ్డి తాత జాగీరా? ప్రజలు తిరగబడితే మీరు పారిపోతారు. నేను మళ్లీ వస్తా.. పుంగనూరు పట్టణమంతా పర్యటిస్తా. తలలు పగులుతున్నా, నెత్తురోడుతున్నా నిలబడిన కార్యకర్తలను అభినందిస్తున్నా. వై నాట్ పుంగనూరు. వై నాట్ 175“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
“భగవంతుడు స్క్రిప్టు రాశాడని అసెంబ్లీలో జగన్ చెప్పారు. దేవుడు ఆ స్క్రిప్టు తిరగ రాశాడు. పుంగనూరులో ఎన్నో అరాచకాలు జరిగాయి. ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకునే బాధ్యత నాది. ఈ రోజు మీరు చూపించిన పట్టుదలను అభినందిస్తున్నా. మొన్నే పులివెందులలో పొలికేక వినిపించా. ఇప్పుడు పుంగనూరులో గర్జిస్తున్నా. అధికార పార్టీకి దాసోహం కావొద్దు. శాంతిభద్రతలు కాపాడండి’’ అని పోలీసులను హెచ్చరించారు.