టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పులివెందుల పర్యటనలో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శించేందుకు సీమలో పర్యటిస్తున్న చంద్రబాబు…పులివెందులలో బహిరంగ సభ నిర్వహించారు. అయితే, సభలో గందరగోళం రేపేందుకు కొందరు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఓపెన్ టాప్ వాహనంలో వైసీపీ జెండాలను ప్రదర్శిస్తూ సభ వద్ద టీడీపీ శ్రేణులను వారు రెచ్చగొట్టడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చిన తర్వాత సభ సజావుగా సాగింది.
ఈ నేపథ్యంలోనే జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం అంటూ జగన్ 5 వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డికి 600 కోట్ల బిల్లులు సెటిల్ చేసి మిగతా కాంట్రాక్టర్లకు మొండిచెయ్యి చూపారని ఆరోపించారు. నాలుగేళ్లలో జగన్ ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదన్నారు. తనను తక్కువ అంచనా వేయొద్దని, కొదమసింహంలా అణచివేస్తానని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారని, ఎవరొస్తారో రండి చూసుకుందాం అని సవాల్ విసిరారు.
సభకు ఎలాంటి స్పందన వచ్చిందో జగన్ చూడాలని వ్యాఖ్యానించారు. పులివెందుల ప్రజల్లో తిరుగుబాటు కనిపిస్తోందని , ఇది చూసి తాడేపల్లిలో ఉన్న నేతలో మార్పు రావాలని అన్నారు. స్థానిక టీడీపీ నేతలు వై నాట్ పులివెందుల? అంటున్నారని చెప్పారు. రాయలసీమ ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని, సీమకు నీళ్లు ఇచ్చాకే, చెన్నైకి నీళ్లు ఇవ్వాలని నాడు ఎన్టీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. రాయలసీమలోని ప్రతి ఎకరానికీ నీరిచ్చే బాధ్యత నాదే అని చంద్రబాబు హామీ ఇచ్చారు. విశాఖలో షాపింగ్ మాల్ తో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగిపోయిందట..అని ఎద్దేవా చేశారు. తాను గట్టిగా మాట్లాడితేనే పులివెందులలో బస్టాండ్ కట్టారని, కుందూ నది ఇసుక బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళుతోందని విమర్శించారు.