ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అంతా తానే అన్నట్లు వ్యవహరించిన భూమా అఖిల ప్రియకు ఆమె సోదరి భర్త మంచు మనోజ్‌తో చెక్ పెట్టాలని టీడీపీ అధినేత చంద్ర బాబు చూస్తున్నారా? అంటే.. రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అఖిల ప్రియ చెల్లెలు మౌనికా రెడ్డిని మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ దంపతులు చంద్రబాబు నాయుడిని కలిశారు. దీంతో మంచు మనోజ్ టీడీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే మంచు కుటుంబం అధికార వైసీపీలో కొనసాగుతున్న విషయం విదితమే. 2019 ఎన్నికల్లో జగన్‌కు మద్దతుగా మోహన్ బాబు, మంచు విష్ణు ప్రచారం చేశారు. వైఎస్ కుటుంబానికి వీళ్లు అత్యంత ఆప్తులు. మరోవైపు భూమా కుటుంబం అంటే టీడీపీలో ఎంతో ప్రాధాన్యత ఉంది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఈ కుటుంబానికి పట్టుంది. ఇప్పుడు భూమా కుటుంబానికి చెందిన అమ్మాయినే మనోజ్ పెళ్లి చేసుకోవడంతో ఆయన కూడా టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మనోజ్‌ను చేర్చుకోవడం ద్వారా రెండు రకాలుగా ప్రయోజనం పొందాలని బాబు చూస్తున్నట్లు సమాచారం. అటు వైసీపీకి మద్దతునిచ్చే మోహన్‌బాబు, విష్ణుకు షాకివ్వడంతో పాటు ఇటు ఆళ్లగడ్డలో అఖిల ప్రియకు చెక్ పెట్టాలని బాబు అనుకుంటున్నారని టాక్. తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత అఖిల ప్రియ టీడీపీ మంత్రిగా పని చేశారు. ఆమె 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీపై పట్టు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీంతో ఆమెపై నియోజకవర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డితో విభేదాలు ఉండడం ఆమెకు మైనస్‌గా మారుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో మరిది మనోజ్‌ను వదిన అఖిల ప్రియ స్థానంలో పోటీ చేయించాలనే ఆలోచనలో బాబు ఉన్నట్లు తెలిసింది.