ఏపీ లో హ్యూమన్ ట్రాఫికింగ్ పెరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహిళలు, యువతులు, చిన్న పిల్లల ట్రాఫికింగ్ గత నాలుగేళ్లుగా విపరీతంగా పెరిగిపోయిందని, వాలంటీర్ల వ్యవస్థ సేకరిస్తున్న సున్నితమైన డేటా సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్లే ఇలా జరుగుతోందని ఆయన ఆరోపించారు. పవన్ ఆరోపిస్తున్నట్లుగానే దాదాపు 30 వేల మంది మహిళలు ఏపీలో మిస్సయ్యారని కేంద్రం కూడా చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఓ సర్వే ప్రకారం చిన్నపిల్లల అక్రమ రవాణాలో తాజాగా ఏపీ రెండో స్థానంలో నిలవడం సంచలనం రేపుతోంది.
గేమ్స్ 24/7 మరియు కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ (KSCF) సంయుక్తంగా విడుదల చేసిన ‘చైల్డ్ ట్రాఫికింగ్ రిపోర్ట్ ఇన్ ఇండియా’ సర్వే నివేదికలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. భారత దేశంలో అత్యధికంగా చిన్న పిల్లల అక్రమ రవాణా జరుగుతున్న రాష్ట్రాలలో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. అనేక రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తర్వాత పిల్లల అక్రమ రవాణా పెరిగింది. ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 2016 మరియు 2022 మధ్య అత్యధిక సంఖ్యలో పిల్లల అక్రమ రవాణా జరిగిందని ఆ నివేదికలో వెల్లడైంది.
ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్‌కు ముందు దశలో (2016-2019) 267 మంది, కోవిడ్ తర్వాత (2021-2022) 1,214 మంది పిల్లలు అక్రమ రవాణాకు గురయ్యారు. బీహార్ లో కరోనాకు ముందు 543 మంది పిల్లలు మిస్ కాగా..కరోనా తర్వాత ఆ సంఖ్య 703గా ఉంది. ఇక, ఏపీలో కరోనాకు ముందు 50 ఉన్న సంఖ్య…కరోనా తర్వాత 210కి గణనీయంగా పెరిగింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వంటి సంస్థలు చైల్డ్ ట్రాఫికర్లను పట్టుకునేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా…వీటికి అడ్డుకట్ట పడడం లేదు.