ప్రముఖ క్రికెటర్.. ఇటీవల ఐపీఎల్ కు గుడ్ బై చెప్పేసి.. రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు అంబటి రాయుడు. తాజాగా ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటిచారు ఇందులో భాగంగా వెలగపూడి శివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన్ను రాజధాని రైతులు కలిశారు. రాజకీయాల్లోకి వస్తున్న విషయాన్ని ప్రస్తావించగా.. ఆ ఆలోచన ఉందన్న విషయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా రాజధాని రైతులు పలువురు తాము చేస్తున్న దీక్షా శిబిరానికి రావాలని కోరారు. తమ కష్టాల్ని వినాలన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన రాయుడు.. అమరావతే రాజధానిగా ఉంటుందని.. ముఖ్యమంత్రి జగన్ కూడా అదే విషయాన్ని తనకు చెప్పినట్లుగా రాయుడు చెప్పారు. అయితే.. రాజధాని డెవలప్ మెంట్ కు సమయం పడుతుందన్న రాయుడు.. అమరావతి రైతులకు అనూహ్య రీతిలో షాకిచ్చారు.
తాము చేస్తున్న అమరావతి ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరగా.. తర్వాత చూద్దామన్నారు. దీంతో అమరావతి రైతులు నిరుత్సాహానికి గురయ్యారు. కనీసం తమ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్లుగా శిబిరానికి రావాలని కోరగా.. అందుకు రాయుడు నో చెప్పటంతో రైతుల నోట మాట రాలేదు. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న రాయుడు.. అందరిని కలుపుకుపోవాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా తన తీరుతో దూరమైతే.. రాజకీయాల్లోకి నెట్టుకురావటం కష్టమన్న విషయాన్ని ఆయన మిస్ అయ్యారా? అన్నది చర్చగా మారింది.