టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కు పెను ప్రమాదమే తప్పింది. దీనిపై అనేక కోణాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు కుట్ర కోణం ఉందా? అనే విషయంపై పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఆరా తీస్తున్నారు. ఒక్కసారిగా గుంపులు గుంపులుగా చొచ్చుకువచ్చిన జనాలు.. నారా లోకేష్‌పై పడేందుకు రెండు నుంచి మూడు సార్లు ప్రయత్నించారు. అయితే.. చాకచక్యంగా నారా లోకేష్ స్వయంగా వారి నుంచి తప్పుకొన్నారు. ఒకచోట తప్పించుకుంటే.. రెండో చోట.. మూడో చోట కూడా ఇలానే జరిగింది.
దీంతో ఈ విషయంలో ఏదైనా ఉద్దేశ పూర్వకం ఉందా? అని టీడీపీ నాయకులు, పార్టీ అధినేత చంద్రబాబు కూడా దృష్టి పెట్టారు.
ఏం జరిగిందంటే..
ప్రస్తుతం యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. యథావి ధిగా ఆయన సోమవారం దర్శి నియోజకవర్గంలోపాదయాత్ర చేస్తున్నారు. తొలుత స్థానిక కార్మికులతోనూ ఆయన భేటీ అయ్యారు. వారి సమస్యలు విన్నారు. హామీలు ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది.. కానీ.. అక్కడి నుంచి బయలు దేరిన తర్వాత.. ఆయన వినుకొండ నియోజకవర్గంలోకి ప్రవేశించాల్సి ఉంది. మరో 5 కిలో మీటర్ల దూరంలో నారా లోకేష్ వినుకొండకు చేరుతారని అనగా.. ఒక్కసారిగా ఎటు నుంచి వచ్చారో కూడా తెలియని విధంగా జనం పోటెత్తారు.
నారా లోకేష్‌పై చొచ్చుకువచ్చారు. వారిని గమనించిన సీబీఎన్ ఆర్మీ సభ్యులు.. నారా లోకేష్‌ను అప్రమత్తం చేశారు వెంటనే నారా లోకేష్ పక్కకు జరిగిపోయారు. ఇలా.. రెండు సార్లు తప్పించుకున్నారు. మూడో సారి తానే స్వయంగా తనపైకి చొచ్చుకు వచ్చిన జనాలను గమనించి.. పాదయాత్రకు విరామం ఇస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు.
అయితే.. లోకేష్ పర్యటనలో జనాభా విరివిగానే వస్తున్నారు. కానీ, ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. కర్నూలు, అనంతపురం వంటి జిల్లాల్లోనూ భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. అయితే.. ఇక్కడ మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఎవరో ప్రోత్సహించినట్టుగా ప్రజలు నారా లోకేష్‌పై కి దూసుకు వచ్చారని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. తొలి రోజు యువగళంలో నందమూరి తారకరత్న కూడా.. ఇలానే జనాల మధ్య ఇరుక్కుని.. ఊపిరాడక అస్వస్థతకు గురై.. మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఘటనలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు.