ఏపీలోని వైసీపీ సర్కారు మెడకు మరో ఉచ్చు తగులుకుంది. ఈ నెల మొదట్లో నిర్వహించిన అమ్మ ఒడి నిధుల విడుదల కార్య క్రమానికి పెద్ద ఎత్తున పాఠశాల విద్యార్థులను తరలించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే అనేక సందర్భాల్లో విద్యార్థు లను తరలించడం.. వాహనాలను వినియోగించడం.. వంటి అంశాలపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ క్రమంలో భవిష్యత్తులో ఇలా చేయొద్దని కూడా హెచ్చరించింది. కానీ, ఇది జరిగిన తర్వాత కూడా అమ్మ ఒడి కార్యక్రమానికి పిల్లలను ప్రభుత్వ అధికారులు తరలించారు.
దీనిపై తాజాగా హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను నూతన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ బెంచ్ స్వీకరించింది. విచారణకు కూడా అనుమతించింది. ఈ క్రమంలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాశ్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. జస్టిస్ ఠాకూర్ ధర్మాసనం ముందు న్యాయవాది జడ శ్రావణ కుమార్ వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్న సభకు స్కూల్ పిల్లలను తరలించడం చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గతంలో ఏం జరిగిందో ఆయన కోర్టుకు వివరించారు. గతంలో హైకోర్టు అనేక సందర్భాల్లో చిన్నారులను రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాలకు తరలించడాన్ని తప్పుబట్టిందని, ఈ సారి జరగనివ్వద్దని కూడా ఆదేశించిందని తెలిపారు. స్కూల్ పిల్లలను అమ్మ ఒడి కార్యక్రమానికి తరలించిన అంశాన్ని విద్యాశాఖ అధికారి సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇచ్చిన అంశాన్ని వివరించారు. విద్యార్థులను రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాలకు తరలించి వద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తీర్పును కూడా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరి దీనిని ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందో చూడాలి.