ఏపీలో ప్రాజెక్టులను సీఎం జగన్ నిర్లక్ష్యం చేశారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా పడకేసిన ప్రాజెక్టులు పేరుతో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ క్రమంలోనే జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితులకు జగన్ కారణమని, జగన్ ప్రజాద్రోహి అని దుయ్యబట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై మాట్లాడే తీరిక సీఎంకు లేదని, ఇరిగేషన్ మంత్రి ఆంబోతులా అరవడం తప్ప ఏమీ తెలీదని ధ్వజమెత్తారు.
కోస్తాంధ్రలో టీడీపీ హయాంలో ప్రాజెక్టులపై రూ.21,442 కోట్లు ఖర్చు చేశామని, కానీ, జగన్ నాలగేళ్లలో రూ.4,375 కోట్లే ఖర్చుపెట్టారని గణాంకాలతో సహా జగన్ గుట్టు బట్టబయలు చేశారు. ఈ విధంగా అయితే ఏపీలో సాగునీటి ప్రాజెక్టులు ఎలా, ఎప్పటికి పూర్తవుతాయని ప్రశ్నించారు. కాలువల నిర్వహణ కూడా సరిగా పట్టించుకోని జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను నీటిపారుదల ప్రాజెక్టులపై మాట్లాడి ప్రభుత్వ గుట్టురట్టుచేస్తున్నానన్న కారణంతో ఏపీ చీఫ్ సెక్రటరీ హడావిడిగా వాటిపై సమీక్ష చేశాడని దుయ్యబట్టారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రాజెక్ట్ లను ట్రైబ్యునళ్ల ముందు నిలిపిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ప్రాజెక్ట్ ల వివాదాలను పరిష్కరించడం లేదని, కానీ, సొంతకేసులు వాదించుకోవడానికి మాత్రం జగన్ వేలకోట్ల ప్రజాధనాన్ని తగలేస్తున్నాడని నిప్పులు చెరిగారు.