కేంద్రప్రభుత్వానికి వైసీపీకి మధ్య ఉన్న బంధం ఎంతటి ధృదమైనదో మరోసారి తెలిసింది మణిపూర్లో అల్లర్లపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఇండియాకూటమి ప్రతిపాదించింది. దాన్ని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ఆమోదించారు. చర్చలకు ఎప్పుడు అనుమతిస్తారనే విషయాన్ని ప్రకటిస్తారు. చర్చల తర్వాత ఓటింగ్ జరుగుతుంది. సరే చర్చల వరకు ఓకేనే కానీ ఓటింగ్ వల్ల ఏమవుతుంది ? ఏమీకాదు. ఎందుకంటే లోక్ సభలో ఎన్డీయే బలం చాలా ఎక్కువగా ఉంది కాబట్టే.
అయితే చర్చల వల్ల మణిపూర్లో అల్లర్లను కంట్రోల్ చేయటంలో కేంద్రప్రభుత్వ వైఫల్యాన్ని ప్రతిపక్షాలు ఎండగట్టేందుకు అవకాశముంది. గడచిన రెండున్నర నెలలుగా మణిపూర్లో అల్లర్లు ఎక్కువగా జరుగుతున్న విషయం యావత్ దేశమంతా చూస్తోంది. ఒకవైపు కర్ఫ్యూ విధించినా మరోవైపు అల్లర్లు, దారుణాలు ఎక్కడా ఆగటంలేదు. కేంద్ర వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నా నరేంద్రమోడీ ప్రభుత్వం మాత్రం బాధ్యత తీసుకోవటంలేదు. ఇలాంటి అంశాలన్నీ అవిశ్వాస తీర్మానం సందర్భంగా చర్చలకు వస్తాయి.
ప్రతిపక్షాలు కేంద్రాన్ని ఎండగట్టడం అయిపోయిన తర్వాత నరేంద్రమోడీ సమాధానమిస్తారు. ఆ తర్వాత ఓటింగ్ జరుగుతుంది. అవిశ్వాసతీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు కాబట్టి చర్చలకు, ఓటింగుకు ప్రతిపక్షాలు రెడీ అయిపోతున్నాయి. కాంగ్రెస్, ఆప్ ఇప్పటికే తమ ఎంపీలకు విప్ కూడా జారీచేశాయి. ఈ నేపధ్యంలోనే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ కేంద్రానికి మద్దతు ప్రకటించింది.
ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. మణిపూర్లో అల్లరపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాల్సిన అవసరం లేదని వైసీపీ అభిప్రాయపడింది. ఇక్కడే కేంద్రప్రభుత్వానికి వైసీపీకి మధ్య ఉన్న బంధం మరోసారి స్పష్టమైంది. ఇప్పటికే రాజ్యసభలో ఎన్డీయే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపుకాస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం-రాష్ట్రప్రభుత్వాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోవ్యవహారాలు నడుస్తున్నాయి. అయితే లోక్ సభలో కూడా కేంద్రానికి మద్దతు ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వైసీపీ మద్దతు లేకపోయినా లోక్ సభలో ఎన్డీయే ప్రతిపక్షాలను ఎదుర్కోగలదు. ఈ విషయం తెలిసికూడా మద్దతివ్వటంతోనే వీళ్ళ బంధంపై మరింత క్లారిటి వచ్చేసింది.