ఔను.. వైసీపీ కీలక నాయకుడు, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి కోపమొచ్చిందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అయితే, ఇది పార్టీ మీదో.. లేక అంతర్గత కుమ్ములాటలతో రోడ్డున పడి, ఇటు పార్టీ పరువు, అటు సర్కారువారి పరువును తీసేస్తున్న సీనియర్ నాయకులపై కాదట. సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో వాస్తవాలను ఆమూలాగ్రం వెలికి తీస్తున్న సీబీఐ అధికారులపైనే అంటున్నారు వైసీపీ మిత్రులు.తాజాగా సజ్జల సీబీఐపై కారాలు మిరియాలు నూరారు.
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు దారుణంగా ఉందని సజ్జల సారు చెప్పుకొచ్చారు. సీబీఐ తాజాగా హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సంస్థను ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ కన్నా దారుణంగా ఉందని పోల్చి చెప్పారు. అంతేకాదు.. అసలు చార్జిషీటులో పేర్కొన్న విషయాలన్నీ కూడా కల్పిత కథనాలేనని ఒక్క మాటతో తేల్చేశారు. సీఎం జగన్‌ను డిఫేమ్(అపహాస్యం) చేయడానికి చేస్తున్న కుట్రలో భాగమని తేల్చి చెప్పారు.
‘‘ప్రైవేట్ డిటెక్టివ్‌కైనా ఇంగిత జ్ఞానం ఉంటుంది. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కల్పిత కథలే కనిపిస్తున్నాయి. బేసిక్ లాజిక్‌ను సీబీఐ మిస్ చేసింది. జగన్‌ను డీమోరలైజ్ చేయడానికే వివేకాను చంపారు. కీలక విషయాలను సీబీఐ పట్టించుకోవట్లేదు. సిట్లు ఇచ్చిన అంశాలను సీబీఐ పక్కనబెట్టేసింది. సీబీఐకి సునీత చెప్పినవన్నీ అబద్ధాలే. నేను, భారతీ కలిసి ఎప్పుడూ సునీత ఇంటికి వెళ్లలేదు. నా భార్యతో కలిసి ఒకసారి పరామర్శకు వెళ్లా.’’ అని సజ్జల వివరించారు. అంతేకాదు, సీబీఐ విచారణను ఎవరో ప్రేరిపిస్తున్నారని.. తెరవెనుక ఉన్నవారు నటిస్తున్నారని.. చెప్పుకొచ్చారు. ఇదీ.. సంగతి!!