ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడమే కాదు.. వెంటనే అమలు కూడా చేసేసింది. అయితే.. ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా కూడా జాగ్రత్త పడింది. అదే.. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఉన్న భద్రతను తొలగించేసింది. కనీసం ఈ విషయాన్ని ఆయనకు కూడా చెప్పకపోవ డం గమనార్హం. మంత్రిగా పనిచేసినప్పటి నుంచి
కన్నాకు వ్యక్తిగత భద్రతను ప్రభుత్వం ఇస్తోంది. అయితే.. మధ్యలో కొన్నాళ్లు లేకపోయినా.. గత టీడీపీ హయాం నుంచి కూడా తిరిగి కన్నాకు భద్రతను కొనసాగిస్తున్నారు.
పల్నాడు ప్రాంతంలో ఇటీవల కాలంలో మావోయిస్టు ప్రభావం పెరుగుతుండడం.. రాజకీయంగా కన్నాకు ఇబ్బందులు ఏర్పడడం వంటి పరిణామాలతో ఆయనకు సెక్యూరిటీని కల్పిస్తూ.. గత చంద్రబాబు ప్రభుత్వం పార్టీలతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకుంది. ఇలా.. 2+2 భద్రతను ఆయనకు కల్పించారు. ఇక, ఈ భద్రతను నిన్న మొన్నటి వరకు వైసీపీ సర్కారు కూడా కొనసాగింది. కన్నా బీజేపీలో చేరి.. రాష్ట్ర చీఫ్గా పనిచేశారు. తర్వాత. కొన్నాళ్లు నాయకుడిగా అదే పార్టీలో ఉన్నారు. ఇక, ఇటీవల ఆయన టీడీపీలోకి జంప్ చేశారు.
అప్పటి వరకు కూడా.. సెక్యూరిటీని కొనసాగించారు. కానీ, టీడీపీలో చేరిన కొన్నాళ్లకే అనూహ్యంగా కన్నా సెక్యూరిటీని తీసేయడం.. చర్చనీయాంశంగా మారింది. కనీసం ఎలాంటి సమాచారం లేకుండానే కన్నా భద్రత సిబ్బందిని తొలగించారని ఆయన కార్యాలయం పేర్కొంది. మరి ఆయనబీజేపీలో ఉన్నంత వరకు కొనసాగించిన భద్రతను ఇప్పుడు తొలగించడం వెనుక.. కేవలం టీడీపీలో చేరారన్న అక్కసే కారణమని కన్నా వర్గీయులు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.