సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కలయికలో సుదీర్ఘ విరామం తర్వాత ఓ సినిమా మొదలవుతోందంటే అభిమానుల ఎంతో ఎగ్జైట్ అయ్యారు. కానీ ఏ ముహూర్తాన ఈ సినిమాను అనౌన్స్ చేశారో కానీ.. గత కొన్నేళ్లలో మరే పెద్ద సినిమాకూ రాని ఇబ్బందులు ఈ సినిమాకు వచ్చాయి. ఈ సినిమా మొదట సెట్స్ మీదికి వెళ్లడానికే చాలా టైం పట్టింది. తర్వాత ఒకసారి ఓ కథతో సినిమాను మొదలుపెట్టి కొన్ని సీన్లు తీశాక ఆపేసి.. మళ్లీ కొత్త కథ మీద కసరత్తు చేసి దాన్ని పట్టాటెక్కించేసరికే ఇంకా చాలా సమయం వృథా అయింది. జరిగిందేదో జరిగిందిలే అనుకుంటే.. ఆ తర్వాత కూడా ఈ చిత్రాన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.
ఇటీవల మళ్లీ షూటింగ్‌కు బ్రేక్ పడటం.. సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్ తప్పుకోవడం.. మహేష్ బాబు లాంగ్ వెకేషన్‌కు వెళ్లడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.
ఈ సినిమాకు ఏదైనా శాపం ఉందా అని అందరూ చర్చించుకుంటున్నారు ఇప్పుడు. నిజానికి శాపం ఈ ఒక్క సినిమాకే కాదు.. మహేష్ బాబు-త్రివిక్రమ్ ఇంతకుముందు కలిసి చేసిన సినిమాలకు కూడా ఉంది. వీరి కలయికలో వచ్చిన ‘అతడు’ సినిమా సమయంలోనూ ఇలాంటి ఇబ్బందులే తలెత్తాయి. మురళీ మోహన్ సంస్థ జయభేరిలో అప్పటిదాకా మరే చిత్రానికీ అవ్వనంత ఆలస్యం ఈ సినిమాకు జరిగింది. బడ్జెట్ కూడా బాగా ఎక్కువ అయిపోయింది. ఈ విషయాలను మురళీ మోహనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుని ఆవేదన చెందారు. ‘అతడు’ను ఇప్పటికీ ఒక క్లాసిక్‌గా అందరూ గుర్తిస్తారు కానీ.. ఓవర్ బడ్జెట్ వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలు చేయి దాటిపోవడం, పెద్ద మొత్తంలోనే నష్టం తెచ్చిపెట్టడంతో మురళీ మోహన్ ప్రొడక్షనే ఆపేశారు. ఇక మహేష్, త్రివిక్రమ్ కలిసి చేసిన రెండో సినిమా ‘ఖలేజా’ అన్ని రకాలుగా నిరాశను మిగిల్చింది. అది పెద్ద బాక్సాఫీస్ డిజాస్టర్. దానికీ వర్కింగ్ డేస్ చాలా ఎక్కువ అయ్యాయి. షూటింగ్ టైంలో రకరకాల ఇబ్బందులతో చాలా ఆలస్యం అయింది. సెట్ కాలిపోవడం.. డేట్లు వేస్ట్ కావడం.. ఇంకేవో కారణాలతో షూటింగ్‌కు బ్రేక్ పడటం.. ఇలా చాలా జరిగాయి. బడ్జెట్ హద్దులు దాటిపోయింది. నిర్మాత పూర్తిగా మునిగిపోయాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ‘గుంటూరు కారం’కు అంతకుమించిన సమస్యలు చుట్టుముట్టాయి. మరి వీరి కాంబినేషన్ అంటేనే ఎందుకిలా జరుగుతోందో?