మెగాస్టార్ చిరంజీవి, మెగా ఫ్యామిలీపై గతంలో రాజశేఖర్ గతంలో పలుమార్లు ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. బహిరంగంగా మీడియా సాక్షిగా కూడా చిరంజీవి సమక్షంలోనే ఆయనపై రాజశేఖర్ కామెంట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ కోవలోనే చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత, రాజశేఖర్ లు సంచలన ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలపై మండిపడ్డ సినీ నిర్మాత అల్లు అరవింద్…వారిద్దరిపై పరువు నష్టం దావా వేశారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆ కేసు విచారణ పూర్తయి రాజశేఖర్, జీవితలకు షాక్ తగిలింది. ఆ కేసులో జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. చిరంజీవి పేరుతో జరుగుతున్న సేవా కార్యక్రమాలపై, ట్రస్టుపై అసత్య ఆరోపణలు చేశారని అల్లు అరవింద్ తన దావాలో పేర్కొన్నారు. అంతేకాదు, ఆ ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను కూడా కోర్టుకు సమర్పించారు.
ఈ క్రమంలోనే ఆ వ్యవహఆరంపై సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత తాజాగా కోర్టు తీర్పునిచ్చింది. ఇద్దరికీ ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా విధించింది. అయితే, వారిద్దరూ జరిమానా చెల్లించడంతో బెయిల్ మంజూరైంది. దాంతోపాటు, ఈ తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం కూడా కోర్టు ఇచ్చింది.