జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నం మంచిదే అనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఆయన వలంటీర్ వ్యవస్థపై చేసిన విమర్శల నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వలంటీర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా.. జనసేన నాయకులు కూడా సర్కారుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ క్రమం లోనే శ్రీకాళహస్తిలో సీఐ అంజు యాదవ్.. జనసేన నేత సాయిపై చేయి చేసుకున్నారు. ఇది భారీ ఎత్తున వైరల్ అయింది.
ఈ విషయంపై నిలదీసేందుకు.. సీఐ అంజు యాదవ్పై చర్యలు కోరేందుకు తాజాగా పవన్ కళ్యాణ్.. తిరుప తి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఆయనకు ఫిర్యాదు చేయనున్నారు. ఇది మంచి పరిణామమే. ఎందుకంటే.. పార్టీ నేతల్లో ఆత్మ స్థయిర్యం నింపేందుకు.. నేనున్నానంటూ.. వారికి భరోసా కల్పించేందుకు పవన్ చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టే అవకాశం లేదు. అయితే.. సోషల్ మీడియా జనాలు సహా.. క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలు కూడా ఒక విషయాన్ని లేవనెత్తుతున్నారు.
కేవలం పవన్ ఒకవైపే చూస్తున్నారా? అనే చర్చ చేస్తున్నారు. ఎందుకంటే.. గత నాలుగేళ్లలో అనేక మంది జనసేన నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు. వాటిపైనాఆయన నిలదీయాలని కోరుతున్నా రు. ముఖ్యంగా జనసేన సరే.. ప్రజలపై కూడా కొన్ని వర్గాలను టార్గెట్ చేసుకుని పోలీసులు ఉక్కుపాదం మోపారు. మరి వారి విషయంపై కూడా పవన్ స్పందించి ఉంటే బాగుండేదని.. అంటున్నారు.
ఇప్పుడు తన వరకు నీళ్లు వచ్చాయనో.. లేక.. తన నాయకుడిని పోలీసులు కొట్టారనో.. ఆయన స్పందిం చడం బాగున్నా.. రాష్ట్రానికి నేతృత్వం వహించాలనే బలమైన కాంక్ష ఉన్నప్పుడు.. ఖచ్చితంగా రాష్ట్రంలో జరిగిన డాక్టర్ సుధాకర్ విషయంలో కానీ.. గుంటూరులో జరిగిన రైతుల నిర్బంధం విషయంలో కానీ..ఇలానే ఆయన ఎస్పీల వద్దకు వెళ్లి తేల్చుకునేలా పనిచేసి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఇప్పటికైనా.. ప్రజలకు ఆయన అండగా ఉంటే.. బాగుంటుందని సోషల్ మీడియా జనాలు సూచిస్తుండడం గమనార్హం.