టీడీపీ యువనాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పేలుస్తున్న పంచ్ డైలాగులకు ప్రజల నుంచి భారీ రియాక్షన్ వస్తోంది. తాజాగా ఏపీ సీఎం జగన్‌ను పిల్లవ కాలువతో పోల్చుతూ.. నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదే సమయంలో చంద్రబాబును ఏపీ జీవనాడి పోలవరంతో పోల్చారు. ఉమ్మడి ప్రకాశంలో నిర్వహిస్తున్న పాదయాత్ర ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గంలో సాగుతోంది.
ఈ సందర్భంగా నారా లోకేష్ జగన్‌పైనా, ప్రభుత్వ తీరు, వలంటీర్ వ్యవస్థపైనా విరుచుకుపడ్డారు. జగన్‌ను డేటా దొంగగా పేర్కొన్నారు. అంతేకాదు.. వలంటీర్లను వాడుకుంటూ.. ఆయన ప్రజల నుంచి కీలక మైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నా డని.. దీనిని వినియోగించి.. ఎన్నికల సమయంలో తప్పుడు పనులు చేయాలని భావిస్తున్నారని విరుచుకుపడ్డారు. వలంటీర్లు ఎంత ఒత్తిడి చేసినా.. ప్రజలు తమ వ్యక్తిగత వివరాలను వారికి ఇవ్వొద్దని నారా లోకేష్ పిలుపునిచ్చారు.
ఇదిలావుంటే.. సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపైనా నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. “బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడేందుకు ఢిల్లీ వెళ్ళాడా…? హత్య కేసులో జగన్, భారతీ పేర్లు ఛార్జ్ షీట్ లో పెట్టకుండా ఉండేందుకు ఢిల్లీ వెళ్లాడా…?“ అని సీఎం జగన్ ఇటీవల ఢిల్లీ పర్యటనపై విరుచుకుపడ్డారు. 2019 ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు.
టీడీపీ మహానాడులో చంద్రబాబు ప్రవేశ పెట్టిన మినీ మేనిఫెస్టో తెలుసా? అని ఈ సందర్భంగా పలువురు మహిళలను నారా లోకేష్ ప్రశ్నించారు. మహిళల కష్టాలు తీర్చే బాధ్యత తాము తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు సీఎం అవగానే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ 15 వేలు చొప్పున ఇస్తామని చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు.