ప్రభుత్వాలు మారతాయి. రాజకీయాలు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండవు. నాయకులు మారతారు. ఏ ఎండ కు ఆ గొడుగు పడతారు. కానీ, ప్రభుత్వ వ్యవస్థలు మాత్రం పటిష్ఠంగా ఉండాలనేది రాజ్యాంగం పేర్కొన్న మాట. అందుకే.. ఆయా వ్యవస్థలకు చట్టాలు.. వాటికి సంబంధించిన నియమాలు ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ వ్యవస్థ.. నిత్యం ఒత్తిడితో కూడిన వ్యవస్థ.. పోలీసు యంత్రాంగం. కనిపించని నాలుగో సింహం అన్నట్టుగా.. పోలీసు వ్యవస్థ పరిఢవిల్లితేనే అన్ని వ్యవస్థలూ సక్రమంగా ఉంటాయి.
అయితే.. ఈ నాలుగో సింహం నవ్వుల పాలవుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహారించాలా? ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిం చాలా? అనేది పోలీసు డిపార్ట్మెంటును దేశవ్యాప్తంగా పట్టి పీడిస్తున్న ప్రశ్న. రాజ్యాంగం.. నియమాలను చూస్తే.. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూనే.. నియమాలు పాటించాల్సి ఉంటుంది.
కానీ, ఈ నియమాల మాట కేవలం పుస్తకాలకే పరిమితమై.. నాలుగో సింహం రాజకీయాల చొరబాటుతో ఉక్కి రిబిక్కిరికి గురవుతోందన్నది కళ్లముందు కనిపిస్తున్న వాస్తవం. ప్రస్తుతం ఏపీ విషయాన్ని తీసుకుం టే.. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు ఆ పార్టీకి కార్యకర్తల్లా పనిచేస్తున్నారని టీడీపీ సహా ఇతర పక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు. అందుకే తమకు స్వతంత్రం లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. ఇక, పోలీసులు కూడా.. ఏదో ఒక చోట దారి తప్పుతూనే ఉన్నారు.
విశాఖలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ సర్వలత, శ్రీకాళహస్తిలో సీఐ అంజు యాదవ్‌లు ఎంత వివాదం అయ్యారో అందరికీ తెలిసిందే. ఇక, ఇతరత్రా చిన్న చిన్న ఘటనల్లో ఎస్ ఐలు, కానిస్టేబుళ్లు కూడా వివాదాలకు కేరాఫ్‌గానే నిలిచారు. వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని అర్ధరాత్రి అరెస్టు లు చేయడం.. కనీస నిబంధనలు పాటించకపోవడం.. పోలీసు మ్యానవల్ అంత పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారని రాష్ట్ర హైకోర్టు గతంలో మాజీ డీజీపీ సవాంగ్‌కు చురకలు అంటించింది.
ఇక, ప్రస్తుత డీజీపీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. సరే.. ఇక్కడ ఒక్కసారి కట్ చేస్తే.. గత టీడీపీ హయాంలో ఏం జరిగిందో కూడా చూద్దాం. నాణేనికి ఒకవైపే చూస్తే.. ఏకపక్షం అవుతుంది. ఇక, టీడీపీ హయాంలోనూ పోలీసులు తక్కువ తినలేదు. అప్పట్లో విపక్ష నేతలను టార్గెట్ చేశారు. ఒక మీడియా సిబ్బందిని కూడా రాత్రికి రాత్రి అరెస్టు చేసి.. కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు.. క్రికెట్ బెట్టింగుల్లోను, కోడి పందేల పందేరంలోనూ సీఐల పాత్ర అప్పట్లో వెలుగు చూసింది.
ఇంతకీ చెప్పొచ్చేదంటంటే.. నాడు-నేడు ఎలా చూసుకున్నా మిలాఖత్ అవుతోంది నాలుగో సింహమే. నియమాల ప్రకారం పనిచేస్తే.. రూల్స్ ప్రకారం వ్యవహరిస్తే.. ఈ అపవాదులు.. అవమానాలుఉండే అవకాశం లేదు. ఇటీవల హైకోర్టు కూడా ఇదే చెప్పింది. కానీ, క్షేత్రస్థాయిలో కేవలం చెప్పుకొనేందుకు మాత్రమే రూల్స్ పనిచేస్తున్నాయి. దీంతో నాలుగో సింహం నాడు నేడు.. కూడా నవ్వులపాలవుతోందనడంలో సందేహం లేదు.