దిగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చినా “మనసు విశాలమయితే విశ్వం మన వశమవుతుంది” అని బలంగా నమ్మిన ఆ యువకుడు జీవితంలో ఎంతో కష్టపడి, పడిన ప్రతిసారి ఉవ్వెత్తున లేస్తూ, లక్ష్యం వైపు అడుగులేస్తూ ముందుకు సాగాడు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి మండలం తిమ్మాయపాలెం లో రైతు కుటుంబంలో కూకట్ల సుబ్బారావు మరియు వింధ్యావళి దంపతులకు మొదటి సంతానంగా జన్మించిన శ్రీనివాస్ కూకట్ల ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే పూర్తి చేసుకుని, హైదరాబాద్ జే.ఎన్.టి.యు లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి అమెరికాలో మాస్టర్స్ చేశారు.
చదువుకునే రోజుల్లోనే క్రింది తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతూ తన ఫీజులు తానే కట్టుకున్న శ్రీనివాస్ అంచెలంచెలుగా ఎదుగుతూ అమెరికాలో ఉద్యోగ దశలో ఎన్నో మైలురాళ్లు దాటుతూ, IT సంస్థలతో పాటు, విద్యా రంగం, రియల్ ఎస్టేట్‌లో తనదైన మార్కును చూపుతూ ముందుకు దూసుకెళ్తున్నారు.
ఈ ప్రయాణంలో తాను విజయాలు సాధిస్తూ మరెంతో మంది భవిష్యత్తుకు నిచ్చెన గా మారి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.
కలలు కనడానికి ఖర్చు లేనప్పుడు ఆషామాషీ కలలు కనడమెందుకు అని భావించే శ్రీనివాస్.. పెద్ద కలలు కని వాటిని సాకారం చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ, తనకు తానే కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటూ, తన తోటి వారిని కలుపుకొని విజయంలో వారిని భాగస్వాములను చేస్తూ ముందుకు సాగుతున్నారు.
జ్యేష్ఠ పుత్రుడిగా చిన్నతనం నుంచే బాధ్యతాయుతంగా కుటుంబానికి చేదోడుగా ఉంటూ తన ఇరువురు తమ్ముళ్ళను సైతం ప్రోత్సహించి అమెరికాలో ఉన్నత స్థానంలో నిల్పటమే కాక తన జీవితంలో ప్రతి అడుగులో వారిని కలుపుకుని కలిసిమెలిసి ముందుకు సాగుతూ మేరీలాండ్‌లో “కూకట్ల సోదరులు”గా మంచి పేరు సాధించి ఆదర్శవంతంగా జీవిస్తున్నారు.
ఎంత సాధించినా ఇవ్వడంలోని తృప్తి పొందటంలో లేదని చిన్న వయసులోనే గ్రహించి “మేరీలాండ్ తెలుగు సంఘం” (TAM) స్థాపనలో కీలక పాత్ర పోషించి మేరీలాండ్ రాష్ట్రంలోని తెలుగు వారిని ఒక్క తాటిపై నిల్పి ఎన్నో సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.
అదే సమయంలో అమెరికాలో తెలుగు వారి సేవలో ప్రసిద్ధమైన జాతీయ సంస్థ తానాలో వివిధ హోదాల్లో పని చేస్తూ అనతికాలంలోనే జాతీయ స్థాయిలో తెలుగు వారిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఎంత ఎదిగినా తన మూలాలను ఎన్నడూ మరిచిపోని శ్రీనివాస్ కూకట్ల తన స్వగ్రామమైన తిమ్మాయపాలెం మరియు అద్దంకి ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, విద్యార్థినులకు సైకిళ్ళ పంపిణీ, తాను చదువుకున్న హైస్కూల్‌కు తాగునీటి సౌకర్యం, లైబ్రరీ నిర్మాణానికి సహకారం అందించడం వంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు.
తానా “చైతన్య స్రవంతి” కార్యక్రమంలో భాగంగా అద్దంకిలో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రకాశం జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు పుస్తక పఠన పోటీలు వంటివి నిర్వహించారు.
ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ పదవుల పంపకాల లో ఈ రోజు తానా సంస్థలో 2023-27 కాలానికి గాను నాన్-డోనార్ కోటాలో ఫౌండేషన్ ట్రస్టీ పదవిని పొంది, అమెరికా లోని తెలుగు వారికి మరింత సేవ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ కూకట్ల మాట్లాడుతూ ఇది ఒక పదవిగా తాను భావించడం లేదని కేవలం ఇది మరింత మంది తెలుగు వారికి చేరువయ్యే వారికి సహాయకారిగా ఉండగలిగే అదృష్టంగా తాను భావిస్తున్నానని వినమ్రంగా పేర్కొన్నారు.
వివిధ రంగాల్లో తెలుగు వారికి నిరంతరం సేవ చేస్తూ, తెలుగు భాష, సంస్కృతి విలసిల్లే కార్యక్రమాలను చేపడుతూ, తెలుగు రాష్ట్రాల్లోని ప్రకృతి విపత్తులకు సహాయ పడుతూ, అమెరికాలోని తెలుగు వారికి ఎటువంటి ఆపద వచ్చిన భరోసాగా నిలుస్తూ, ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగు వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ, తెలుగు వారి ఐకమత్యానికి కృషి చేసే తానా ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసేలా పని చేస్తానని ఆనందంగా చెప్పారు.
ఈ సందర్భంగా తనకు ఈ అవకాశం ఇచ్చిన తానా కార్యవర్గానికి, ప్రోత్సహించిన మిత్రులకు, ఎప్పుడూ వెన్నంటి నిలబడే కుటుంబ సభ్యులకు, చిన్ననాటి నుండి సన్మార్గంలో నడిపిన తల్లిదండ్రులకు, గురువులకు తాను ఎంతో రుణపడి ఉంటానని పేర్కొన్నారు.