టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 154వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో చోడవరం క్యాంప్ సైట్ నుంచి యువగళం పాదయాత్ర మొదలైంది. లోకేశ్ ను కలిసేందుకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలోనే కొండాపురం బహిరంగ సభకు ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. ఈ సందర్భంగా జగన్ పాలనను లోకేశ్ ఎండగట్టారు.
సింహపురిలో తాను సింహంలా అడుగుపెట్టానని, అడుగుపెట్టనివ్వం అన్న వాళ్లు అడ్రస్ లేరని లోకేశ్ దుయ్యబట్టారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశానని, తనను నెల్లూరు ఆదరించిందని అన్నారు. ఒక్క అడుగు వెయ్యనివ్వం అన్నారని, కానీ, తాను 2 వేల కిలోమీటర్లు నడిచానని చెప్పారు. ప్రజల్ని కలవకుండా అడ్డుకుంటామన్నారని,154 రోజులుగా ప్రజల్లోనే ఉన్నానని చెప్పారు. జగన్ ది పోలీసు బలం.. నాది ప్రజాబలం అంటూ పంచ్ వేశారు.
జగన్ ఒక కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్ అని, బటన్ నొక్కగానే రూ.10 అకౌంట్లో పడుతుందని,ఇంకో బటన్ నొక్కగానే విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ బస్ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇలా రకరకాల పన్నుల పేరిట రూ.100 కట్ అవుతుందని ఎద్దేవా చేశారు. మరోవైపు, లోకేశ్ పాదయాత్రకు ఈ నెల 13,14వ తేదీలలో బ్రేక్ పడనుంది. ఈ నెల 14వ తేదీన మంగళగిరి అడిషినల్ మేజిస్ట్రేట్ కోర్టుకు లోకేశ్ రానున్నారు. తప్పుడు వార్తలు రాస్తూ, తనని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందంటూ సాక్షిపై గతంలో లోకేశ్ పరువునష్టం దావా వేశారు.
వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. ఈ కేసులో పిటిషనర్ అయిన లోకేశ్ వాంగ్మూలాన్ని 14వ తేదీ శుక్రవారం నమోదు చేసేందుకు మంగళగిరి రానున్నారు.