ఏపీ అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికల్లోనూ విజయం దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. వైనాట్ 175 ఎలా ఉన్నా.. కనీసం అధికారంలోకి అయినా వచ్చేలా వ్యూహాత్మకంగా చక్రం తిప్పుతోంది. టీడీపీ-జనసేన పరిస్థితి ఎలా ఉన్నా.. వీటితో బీజేపీ పొత్తులు పెట్టుకోకుండా కూడా నిలువరించే ప్రయత్నం చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. దీంతో తమ విజయానికి ఢోకా లేదని వైసీపీ నాయకులు పదే పదే చెబుతున్నారు.
అయితే.. వాస్తవానికి వైసీపీపై ఉన్న సింపతీ.. ఆ పార్టీపై ఉన్న నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతోందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అమ్మ ఒడి పథకం కింద లబ్ధిదారులుగా ఉన్న వారికి నిధులు ఇప్పటికీ అందలేదు. గత నెల 28న ఎంతో అట్టహాసంగా పార్వతీపురం మన్యం జిల్లాలో సీఎం జగన్ ఈ పథకాన్నినాలుగో విడత ప్రారంభించారు. అయితే.. ఇది ప్రారంభించి కూడా.. 10 రోజులు గడిచినా.. సగానికి పైగానే లబ్ధిదారులకు నిధులు అందలేదు.
ఇది జిల్లాల స్థాయిలోనే కాకుండా.. మండలం, గ్రామీణ స్థాయిలోనూ.. కలకలం రేపుతోంది. లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పథకానికి బటన్ నొక్కి పది రోజులు అయినా.. ఇంకా నిధులు ఇవ్వలేదని.. వందల సంఖ్యలో తల్లులు ప్రభుత్వ కార్యాలయాల ముందు.. నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొందరు.. అయితే.. తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం తమను మోసం చేసిందని అంటున్నారు.
ఈ సెగను తగ్గించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం.. ప్రభుత్వం కూడా వివరించకపోవడం ఇప్పుడు వైసీపీపై నమ్మకాన్ని, జగన్ నమ్ముకున్న విశ్వాసాన్ని కూడా ప్రశ్నార్థం చేస్తున్నాయి. ఇది కనుక ఇలానే కొనసాగితే.. వచ్చే ఎన్నికల్లో మహిళలు రివర్స్ అయ్యే ప్రమాదం ఉందని.. ఇది వైసీపీ ఓటమికి దారి తీసినా.. ఆశ్చర్యం లేదని..పరిశీలకులు చెబుతున్నారు.
ఒకవేళ మరో వారంలో నిధులు ఇచ్చినా.. ఒక్కసారికనుక ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో నమ్మకం సన్నగిల్లితే.. అది ఎన్నికల వరకు కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. దీంతో వైసీపీ కొంప ఎవరూ ముంచక్కర్లేదని.. వారిపతనం వారే కొని తెచ్చుకున్నట్టు అవుతుందని చెబుతున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి. మరో వైపు ఖజానాలో రూపాయి కూడా లేదని తాజాగా ఆర్థిక శాఖ చెప్పడం గమనార్హం.