కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ చివరకు దారికొచ్చినట్లు కనిపిస్తోంది. బీజేపీ తెలంగాణా అధ్యక్షుడిగా ఉన్న బండిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సడెన్ గా మార్చేశారు. బండి స్ధానంలో కొత్త అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. అంటే అధ్యక్షుడిగా బండిని తప్పించినట్లుగానే కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డినీ తప్పించారు. దాంతో ఇద్దరిలోను అసంతృప్తి పెరిగిపోయింది. ఇద్దరి అసంతృప్తిలో ఎవరి కారణాలు వాళ్ళకున్నాయి.
ఎన్నికలు మరో ఆరుమాసాల్లో ఉండగా తనను అధ్యక్షుడిగా తప్పించటాన్ని బండి జీర్ణించుకోలేకపోయారు. మూడేళ్ళుగా బండి నానా అవస్తలు పడి పార్టీకి ఊపుతీసుకొచ్చింది వాస్తవం. అంతకుముందు బీజేపీకి తెలంగాణాలో అసలు ఊపే ఉండేదికాదు. కార్యక్రమాలు కూడా ఏదో మొక్కుబడిగా, నిస్తేజంగా జరిగేవి. ఏ కార్యక్రమం పెట్టినా నేతల్లో ఏదో పాల్గొన్నామంటే పాల్గొన్నామన్నట్లుగా ఉండేవాళ్ళు. అలాంటిది బీజేపీకి మంచి ఊపుతెచ్చింది మాత్రం బండి సంజయ్ అనే చెప్పాలి.
అలాంటిది సడెన్ గా తనను మార్చేయటాన్ని బండి తట్టుకోలేకపోయారు. ఇక కిషన్ కోణంలో చూస్తే కేంద్రమంత్రి హోదాలో హ్యాపీగా ఉన్నారు. మరో ఆరుమాసాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో మంత్రిగానే టర్మ్ పూర్తిచేసుకోవాలని అనుకున్నారు. అలాంటిది ముందుగా చెప్పకుండానే తనను మంత్రిగా తప్పించి తెలంగాణా అధ్యక్షుడిగా నియమించటంతో షాక్ తిన్నారు. అందుకనే ఇటు బండి అటు కిషన్ కూడా దాదాపు 24 గంటలు పార్టీ నేతలకు, మీడియా కూడా కనబడకుండా మాయమైపోయారు.
అధ్యక్షుడిగా రావటం కిషన్ కు ఏమాత్రం ఇష్టంలేదు. ఎందుకంటే గతంలో నాలుగుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన కిషన్ కేంద్రమంత్రిగానే ఉండాలని అనుకున్నారు. అయితే వాళ్ళ ఇష్టాలతో పనిలేకుండా నరేంద్రమోడీనే మార్పులు చేసేశారు. దాంతో వీళ్ళిద్దరు అలిగారు. అయితే 24 గంటల్లో ఏమైందో ఏమో మరుసటి రోజు ఇద్దరు మీడియా ముందుకొచ్చారు. నేతలతో టచ్ లోకి వెళ్ళారు. తమలో ఎలాంటి అసంతృప్తి లేదని సంతోషంగానే ఉన్నామని చెప్పుకున్నారు. ఏ బాధ్యతలు ఇచ్చినా సంతోషంగా నెరవేరుస్తామని మీడియా ముందు జీవంలేని మొహాలతో చెప్పారు. మొత్తానికి వీళ్ళ పద్దతి చూస్తే ఇద్దరూ దారికొచ్చినట్లే అనిపిస్తోంది.