కోడి కత్తి కేసు పేరు చెప్పగానే ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం జగన్ గుర్తుకొస్తారు. ఆ తర్వాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గుర్తుకొస్తారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన కోడి కత్తి హైడ్రామా ఎపిసోడ్ కు జగన్ యాక్టర్ అయితే పీకే డైరెక్టర్ అని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పీకే ఆధ్వర్యంలోనే కోడి కత్తి ఎపిసోడ్ రక్తి కట్టిందని, ఆ ఎపిసోడ్ తోనే జగన్ సీఎం అయ్యారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఆ ఘటన తర్వాత రాష్ట్రంలో జగన్ దశ తిరిగిపోయింది. అయితే, ఆ దాడి చేసిన శ్రీనివాస్ పరిస్థితి మాత్రం అధ్వాన్నంగా తయారైంది.
ఈ కేసులో దాదాపు 5 సంవత్సరాలు శ్రీను కోర్టులోనే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. శ్రీనివాస్ తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎన్ఐఏ కోర్టును కొంతకాలం క్రితం అభ్యర్థించగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, శ్రీనివాస్ కు ఇచ్చిన బెయిల్ ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నిన్న విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో మరోసారి బెయిల్ కోసం శ్రీను దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ పై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలోనే ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన కేసు విచారణలో జాప్యానికి నిరసనగా జైల్లోనే నిరాహార దీక్ష చేసేందుకు శ్రీను సిద్ధమయ్యాడు. ఈ ప్రకారం శ్రీను తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సలీం ఆ విషయాన్ని వెల్లడించారు. ఐదేళ్లుగా క్లయింట్ శ్రీనివాస్ జైల్లోనే ఉన్నాడని, అతడికి న్యాయస్థానం రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించాలని కోరారు. రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించని పక్షంలో శ్రీనివాస్ జైల్లోనే నిరాహార దీక్ష చేస్తానని తనతో చెప్పినట్లు వివరించారు. ఏది ఏమైనా జగన్ కు శ్రీను తాజాగా షాక్ ఇచ్చినట్లయింది.