బీజేపీ నాయకత్వం దగ్గుబాటి పురందేశ్వరి పై చాలా పెద్ద బాధ్యతలను మోపారు. మరో పదినెలల్లో ఎన్నికలు రాబోతున్న సమయంలో తనపై మోపిన బాధ్యతలను ఆమె ఏ విధంగా మోయగలరు అనే విషయమై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఏపీ బీజేపీ అధ్యక్షులుగా ఎవరున్నా చేయటానికి ఏమీలేదు. బేసికల్ గా పార్టీకి అసలు బలమే లేదు. పైగా రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రయోజనాలను నరేంద్రమోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తోంది. దీంతో జనాలంతా కేంద్రప్రభుత్వం+బీజేపీ అంటేనే మండిపోతున్నారు.
ఈ నేపధ్యంలోనే పార్టీ బలపడలేకపోతోంది. పార్టీపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నతర్వాత అధ్యక్షులుగా ఎవరుంటే మాత్రం ఏమిటి ? అధ్యక్షులుగా కన్నా లక్ష్మీనారాయణ, సోమువీర్రాజు విఫలమైన విషయం తెలిసిందే. కాపు నేతలుగా ప్రచారంలో ఉన్న వాళ్ళిద్దరే ఫెయిలైనపుడు ఇక ఏమాత్రం బేస్ లేని పురందేశ్వరి ఏమిచేయగలరు ? ఎన్టీఆర్ కూతురు అనే గుర్తింపు తప్ప పురందేశ్వరికి ఇంకేమీలేదు. కాంగ్రెస్ అభ్యర్ధిగా రెండుసార్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సహకారంతో గెలిచారంతే.
ఆమెకంటు ఏ జిల్లాపైన లేదా సొంత సామాజికవర్గం పైన కూడా పట్టులేదు. పోనీ పార్టీలో అయనా పట్టుందా అంటే అదీలేదు. మరి ఏ విధంగా ఆమెను పార్టీకి అధ్యక్షురాలిని చేశారో నరేంద్రమోడీకే తెలియాలి. ఎందుకంటే మోడీ ఆమోదంలేకపోతే ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ ఏమి జరగదని అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లశాతం 0.56. దాన్ని పెంచుకోవటానికి పార్టీచేసిన ప్రయత్నాలు కూడా ఏమీలేదు. జనాల్లో పట్టుపెంచుకోవటానికి పార్టీకి చెప్పుకోవటానికి ఏమీలేదు. విభజనచట్టాన్ని తుంగలో తొక్కేస్తోందన్న మంట జనాల్లో బాగా పేరుకుపోయింది.
దీనికి అదనంగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేటీకరించేస్తోంది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు జనాలకు పురందేశ్వరి ఎన్ని అబద్ధాలు చెప్పారో అందరికీ గుర్తుండే ఉంటుంది. అసలు పురందేశ్వరిని అద్యక్షురాలిగా ఎంపికచేయటంలో అగ్రనేతలు ఏమి ఆశించారో కూడా అర్ధంకావటంలేదు. 2019 ఎన్నికల్లో వైజాగ్ నుండి పురందేశ్వరి పోటీచేస్తే వచ్చిన ఓట్లు 33,892. అంటే ఆమెకు డిపాజిట్ కూడా రాలేదంటేనే ఆమె ఏ స్ధాయి నేతో అర్ధమైపోతోంది. మరి పార్టీతో పాటు ప్రజల్లో ఆమె ప్రభావం ఏముంటుందో చూడాల్సిందే.