టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో లోకేష్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగానే ప్రజలు, మహిళలు, యువత నుంచి లోకేష్ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే మహిళలతో లోకేష్ నిర్వహించిన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. మహాశక్తితో లోకేష్ అంటూ స్థానిక మహిళల సమస్యలు తెలుసుకునేందుకు లోకేష్ వారితో ముఖాముఖి నిర్వహించారు.
ఈ నేపథ్యంలోనే లోకేష్ పాదయాత్రకు స్థానిక నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ హాజరై మధ్యలో నుంచి వెళ్లిపోయిన వైనంపై చర్చ జరుగుతోంది. లోకేష్ పాదయాత్ర నుంచి నారాయణ ఇంటికి వెళ్లిపోయారని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు రూరల్ని నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతున్నప్పటికీ తాను ఎందుకు మధ్యలో వెళ్లి పోవాల్సి వచ్చిందో నారాయణ క్లారిటీ ఇచ్చారు. లోకేష్ పాదయాత్రకు అనూహ్యం స్పందన వచ్చిందని, పాదయాత్ర సందర్భంగా రద్దీ ఎక్కువ కావడం వల్ల తాను తిరిగి వచ్చానని నారాయణ క్లారిటీ ఇచ్చారు
మహాశక్తితో లోకేష్ కార్యక్రమానికి 800 మంది మహిళలు వస్తారని అంచనా వేశామని, కానీ, అనూహ్యంగా 3000 మంది వచ్చారని తెలిపారు. ఆ విధంగా అనుకోకుండా భారీ సంఖ్యలో మహిళలు రావడంతో రద్దీ ఎక్కువైందని, అందుకే ఆరోగ్య కారణాల రీత్యా తాను అక్కడ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని వివరణనిచ్చారు. రాజకీయ నాయకుడంటే తిట్టడం, తిట్టించుకోవడం కాదని అన్నారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యం అని, నెల్లూరును తాను ఎంతలా అభివృద్ధి చేశానో ఇక్కడ ప్రజలకు తెలుసని నారాయణ అన్నారు.
ఇక నెల్లూరు రూరల్ లో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర ఈరోజు నెల్లూరు సిటీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో జరగబోయే భారీ బహిరంగ సభలో లోకేష్ పాల్గొనబోతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో లోకేష్ పై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ఆయన అనిల్ కుమార్ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సాయంత్రం జరగబోయే బహిరంగ సభ ప్రాధాన్యతను సంతరించుకుంది.