కన్ఫ్యూజ్ కావొద్దు. ఒక వ్యక్తి వయసు రాత్రికి రాత్రే ఎలా తగ్గిపోతుంది? మీరు.. మీ రాతలు అని అప్పుడే తీర్పులు ఇవ్వొద్దు. విషయం చదివిన తర్వాత.. ఔరా అంటూ ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రభుత్వాలు తీసుకునే సిత్రమైన నిర్ణయాలకు ఇలాంటి విచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. దక్షిణ కొరియా దేశ జనాభా 5 కోట్ల నుంచి ఐదున్నర కోట్ల వరకు ఉంటుంది. మామూలుగా ఎవరినైనా మీ వయసు ఎంత అంటే.. ఎంతో ఠపీమని చెబుతారు. కానీ.. దక్షిణ కొరియాలో మాత్రం కాస్త సిత్రం.
అక్కడి ప్రజల్ని వయసు గురించి అడిగితే.. ప్రశ్న అడిగినోడు జుట్టు పీక్కోవాల్సిందే. కారణం.. ఆ దేశ ప్రజలకు మూడు రకాల వయసులు ఉంటాయి. అందరి మాదిరి సంప్రదాయ పద్దతిలో ఉండే వయసు ఒకటైతే.. వయసు లెక్కించేందుకు ఆ దేశంలో అనుసరించే కేలండర్ ఏజ్.. అంతర్జాతీయ వయసు అన్న మూడు రకాలుగా ఉంటుంది.
కొరియన్ సాంప్రదాయం ప్రకారం బిడ్డ కడుపులో పడిన నాటి నుంచే వయసును లెక్కించటం మొదలు పెడతారు. అదే సమయంలో జనవరి 1 నుంచి వయసు లెక్కిస్తారు. ఉదాహరణకు ఒకరు డిసెంబరు 31న పుట్టారనుకుందాం. జనవరి 1 నాటికి వారి వయసు ఎంత అవుతుంది. ఒక రోజు. కానీ.. ఇక్కడ మాత్రం రెండేళ్లుగా గుర్తిస్తారు. ఇక.. అంతర్జాతీయ నియమాలకు అనుగుణంగా మనకు బాగా తెలిసిన డేట్ ఫార్మెట్ లో మరో వయసు లెక్కింపు ఉంటుంది.
ఈ లెక్కింపు పద్దతి ఎంత గందరగోళంగా ఉంటుందన్న దానికి ఒక ఉదాహరణ చెప్పొచ్చు. ఒక వ్యక్తి 2002 జూన్ 30న పుట్టాడనుకోండి.
ఆ వ్యక్తికి జూన్ 29 నాటికి ఇంటర్నేషనల్ ఏజ్ 20 ఏళ్లు. అదే సంప్రదాయ పద్దతిలో 21 ఏళ్లు.. అదే కొరియన్ ఏజ్ విధానంలో 22 ఏళ్లు. దీంతో.. అన్నింటా ఈ ఏజ్ అన్నది ఒక పెద్ద గందరగోళంగా మారింది. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఈ మూడు రకాల వయసులకు సంబంధించిన రికార్డుల్ని నిర్వహించటం భారంగా మారింది.
ఈ గందరగోళానికి తెర దించుతూ.. అంతర్జాతీయ విధానం అంటే.. మనందరి వయసును ఎలా అయితే డేట్ ఫార్మాట్ లో లెక్కిస్తారో.. అలా లెక్కించటం మొదలు పెట్టారు.ఈ కొత్త విధానాన్ని బుధవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పటి నుంచి పుట్టిన తేదీ ఆధారంగానే దక్షిణ కొరియాలో వయసును లెక్కించే విధానాన్ని అమలు చేస్తారు. సౌత్ కొరియా అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు. సంప్రదాయ పద్దతిలో.. ఇప్పటి వరకు అనుసరిస్తున్న కొన్ని పద్దతుల కారణంగా అనవసరమైన కన్ఫ్యూజన్ తో పాటు.. ఆర్థికంగా భారంగా మారుతుందన్న మాట ఆయన చెబుతున్నారు.
అందుకు తగ్గట్లే.. కొత్త పద్దతిలో అనవసరమైన గందరగోళానికి తెర దించారు. ఈ కొత్త లెక్కింపు విధానాన్ని దేశంలోని అన్ని విభాగాల్లోనూ అమలు చేయనున్నారు. ఈ కొత్త చట్టాన్ని గత ఏడాది డిసెంబరులో పార్లమెంట్ లో ఆమోదించారు. అంతేకాదు ప్రజాభిప్రాయంలోనూ ప్రభుత్వ నిర్ణయాన్ని 86.2 శాతం మంది కొరియన్లు అనుకూలంగా ఓటేశారు. ఈ కారణంగా.. రాత్రికి రాత్రే.. దక్షిణ కొరియాలోని ప్రజల వయసు ఒకటి నుంచి రెండేళ్ల వరకు తగ్గిపోయాయి.