సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి అప్రువర్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే, అప్రువర్ గా మారిన తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన దస్తగిరి పులివెందులలో సెటిల్మెంట్లు, ధందాలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దస్తగిరి రక్షణ కోసం ప్రభుత్వం ఇద్దరు గన్ మెన్లను కేటాయించినప్పటికీ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తరఫునుంచి తనకు ప్రాణహాని ఉందని దస్తగిరి ఇప్పటికే పలుమార్లు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తాజాగా తనపై తప్పుడు కేసు బనాయించారని దస్తగిరి షాకింగ్ ఆరోపణలు చేశారు. ఒక బాలుడిని కిడ్నాప్ చేసి హింసించినట్టుగా తనపై తప్పుడు కేసు పెట్టారని దస్తగిరి అంటున్నారు. ఈ క్రమంలోనే కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ కు ఫిర్యాదు చేశారు. తన భార్య షబానాతో కలిసి ఎస్పీని కలిసిన దస్తగిరి మరో మారు ఎంపీ అవినాష్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు. అవినాష్ రెడ్డి అనుచరులతో పాటు కొంతమంది వైసీపీ నేతలు తనను బెదిరిస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని దస్తగిరి ఆరోపిస్తున్నారు.
ఒకవేళ తనపై ఆరోపణలు వచ్చినట్లుగా తాను సెటిల్మెంట్లకు పాల్పడి ఉంటే తనతో పాటు ఉన్న గన్ మెన్లకు
తెలిసి ఉండేదని దస్తగిరి ఎస్పీ ముందు వాపోయారు. తనపై తప్పుడు కేసు పెట్టారని, ఈ వ్యవహారంపై సీబీఐ ఎస్పీతో పాటు జిల్లా న్యాయమూర్తికి లేఖ రాసి ఫిర్యాదు చేశానని దస్తగిరి వెల్లడించారు.