కీలక తీర్పును ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. భర్త ఆస్తిలో భార్య వాటా మీద క్లారిటీ ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భర్త సంపాదించిన డబ్బులో కొనుగోలు చేసిన ఆస్తిలోనూ భార్యకు సమాన వాటా ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి స్పష్టమైన వాదనను వినిపించింది. భర్త సంపాదించే ఆస్తుల్లో భార్యకు సమానవాటా ఎందుకన్న దానిపై స్పష్టమైన జస్టిఫికేషన్ ఇవ్వటం గమనార్హం. మరణించిన తన భర్త ఆస్తుల్లో తనకు సమాన వాటా ఇవ్వాలంటూ అమ్మాల్ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఆసక్తికర ఆదేశాల్ని జారీ చేసింది.
ఒక ఇల్లాలిగా భార్య కుటుంబ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించటం వల్లనే.. భర్త స్వేచ్ఛగా.. ఒత్తిడి లేకుండా పని చేసేందుకు వీలు అవుతుందన్న విషయాన్ని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. బయట పని చేసుకురావటానికి ఇంటికి సంబంధించిన అంశాలన్ని భార్యే చూసుకోవటం వల్ల భర్త సంపాదించిన ఆస్తుల్లో సమాన వాటా భార్యకు ఉంటుందని స్పష్టం చేసింది. భారతదేశంలో భార్యల భాగస్వామ్యాన్ని ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా గుర్తించే చట్టాన్ని రూపొందించలేదన్న హైకోర్టు.. వారి సేవల్ని గుర్తించకుండా న్యాయస్థానాన్ని ఎవరూ ఆపలేరని పేర్కొంది.
భార్య కారణంగానే భర్తలు మరింత స్వేచ్ఛగా వారి పనులు చేయగులుగుతుున్నారని.. ఈ కారణంతోనే వారు సంపాదించగలుగుతున్నట్లు హైకోర్టు పేర్కొంది. ‘ఎలాంటి ఒత్తిడి లేకుండా భర్త సంపాదనకు భార్య సాయం చేస్తుంది. ఈ విషయాన్ని ఈ కోర్టు గుర్తిస్తోంది. దశాబ్దాల పాటు కుటుంబాన్ని.. పిల్లలను భార్య ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. చివరకు ఆమెకు తన సొంతమని చెప్పటానికి ఏమీ మిగలదు. కుటుంబ కోసం ఆస్తుల సంపాదనలో భర్త ప్రత్యక్షంగా.. భార్య పరోక్షంగా సాయం చేస్తుంది. అందుకే ఇద్దరికి సమాన వాటా ఉంటుంది’ అని హైకోర్టు జడ్జి జస్టిస్ రామస్వామి పేర్కొన్నారు. అమ్మాల్ భర్త ఆస్తుల్లో సమాన వాటా ఆమెకు చెందుతుందన్న విషయాన్ని కోర్టు పేర్కొంటూ..వాటిని తీసుకునేందుకు అనుమతిని ఇచ్చింది.