కేసీఆర్ కు లెఫ్ట్ పార్టీలు గట్టి అల్టిమేటమే ఇచ్చాయి. రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పొత్తుల విషయంతో పాటు సీట్ల కేటాయింపు అంశాన్ని వెంటనే తేల్చాలని డిమాండ్ చేశాయి. ఒకవేళ పొత్తులు వద్దని అనుకున్నా ఆ విషయాన్ని చెప్పేయాలని నిలదీశాయి. అంతేకానీ నాన్చుడు ధోరణి వల్ల తాము బాగా నష్టపోతామమనే ఆందోళన వ్యక్తంచేశాయి. బీజేపీ వ్యతిరేక పోరాటాలు చేస్తున్నారన్న ఏకైక కారణంతో మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో మద్దతిచ్చిన విషయాన్ని సీపీఐ, సీపీఎం పార్టీలు గుర్తుచేశాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏదో ఒక పార్టీకి తోక పార్టీల్లాగా లెఫ్ట్ పార్టీలు తయారైపోయాయి. ఏ పార్టీ మద్దతు లేకపోతే సీపీఐ, సీపీఎం పార్టీలు గెలుపు అవకాశాలు తక్కువనే చెప్పాలి. తమంతట తాముగా గెలవలేకపోయినా ఏదో ఒక పార్టీని ఓడగొట్టడానికి మాత్రం పనికొస్తాయి. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో కమ్యూనిస్టు పార్టీలకు కొన్ని నియోజకవర్గాల్లో బలముంది. మొన్నటి మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ కు కమ్యూనిస్టు పార్టీలు మద్దతుగా నిలవకపోతే ఓడిపోయేదే.
దాన్ని బూచిగా చూపించి ఇపుడు వామపక్షాలు కేసీఆర్ తో బేరాలాడుకుందామని అనుకుంటున్నాయి. అయితే వీళ్ళ బేరాలు కేసీయార్ దగ్గర చెల్లవు. అవసరానికి ఉపయోగించుకుని తర్వాత అవతలకు నెట్టేయటంలో కేసీయార్ నెంబర్ 1 అన్న విషయాన్ని వామపక్షాలు మరచిపోయాయి. ఇందులో భాగంగానే ఇపుడు కమ్యూనిస్టులతో పొత్తు విషయాన్ని తేల్చటంలేదు. రెండు పార్టీలు కలిసి సుమారు 15 సీట్లను అడుగుతున్నాయట. అన్నిసీట్లను కాదుకదా అసలు ఒక్కసీటును కూడా కేటాయించే ఉద్దేశ్యం కేసీయార్ కు లేదని సమాచారం.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపుకోసం పనిచేయాలని ఇదివరకే చెప్పారట. అందుకు ప్రతిఫలంగా ఎంఎల్సీలను ఇస్తానని ఆఫర్ ఇచ్చారని పార్టీలో టాక్. అయితే కేసీయార్ ప్రతిపాదనను గనుక ఆమోదిస్తే అంతంతమాత్రంగా ఉన్న కమ్యూనిస్టుల బలం ఎందుకు పనికిరాకుండా పోతుంది. అందుకనే దానికి అంగీకరించటం లేదు. తమకు 15 సీట్లు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నాయట. ఈ కారణంగానే కేసీయార్ పొత్తుల విషయాన్ని ఎటు తేల్చటం లేదు. ఈ విషయం కమ్యూనిస్టులకు ఎప్పటికి అర్ధమవుతోందో ఏమో.