వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహాలు, కార్యకలాపాలన్నీ చాలా ఏళ్ల నుంచి ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ‘ఐప్యాక్’ టీం కనుసన్నల్లోనే నడుస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలకు ముందు వైసీపీ రాజకీయ వ్యూహాలన్నీ ఐప్యాక్ టీం రచించినవే. ఈ టీం తమ క్లైంట్ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంత వరకు అయిన వెళ్తుందని.. బరితెగిస్తుందనే అభిప్రాయం బలంగా ఉంది. ఇందుకు కోడికత్తి వ్యవహారం లాంటి వాటిని ఉదాహరణగా చూపిస్తుంటారు వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు.
ఇక పార్టీ నేతల కంటే కూడా జగన్కు ఐప్యాక్ టీం మీదే గురి అని.. అందుకే వారికి ఎక్కడ లేని ప్రయారిటీ ఇస్తుంటారని.. ఐప్యాక్ వాళ్లకు వైసీపీ నేతలు కూడా ఎదురు చెప్పలేరని ఆ పార్టీ అంతర్గత విషయాలు తెలిసిన వాళ్లు అంటుంటారు. ఐప్యాక్ టీం ఎంత హద్దులు దాటి వ్యవహరిస్తుంది అనడానికి ఒక తాజా ఉదాహరణ చూద్దాం. శుక్రవారం గుంటూరులో కార్పొరేషన్ మీటింగ్ జరగ్గా.. ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు ఐప్యాక్ టీం సభ్యులు కూడా మీటింగ్ హాల్లో కూర్చోవడం సంచలనం రేపింది.
టీడీపీ నేతలు వీరిని గుర్తించి. మీటింగ్ మధ్యలో పెద్ద గొడవే చేశారు. ఐప్యాక్ టీం సభ్యులను చూపిస్తూ.. వీళ్లు ప్రజా ప్రతినిధులా.. లేక అధికారులా.. వీళ్లు ఇక్కడ అసలెందుకు ఉన్నారు అంటూ.. మీడియా కెమెరాల ముందు ప్రశ్నిస్తూ వారి వైపు మళ్లారు. ఊహించని ఈ పరిణామంతో అధికార పార్టీ సభ్యులు, అధికారులు అవాక్కయ్యారు. మీడియా ఉండటంతో ఐప్యాక్ టీం సభ్యులు సైలెంటుగా అక్కడి నుంచి జారుకోవడానికి ప్రయత్నించారు. కానీ మీడియా వాళ్లు వదిలితేనా.. వారిని అలాగే వెంబడించారు.
ముఖాలు దాచుకుంటూ.. ఐప్యాక్ టీం సభ్యులు పారిపోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు కానీ.. అందరూ మీడియాకు దొరికిపోయారు. ఎవరు మీరు.. ఎందుకు ఈ మీటింగ్లో ఉన్నారు అంటున్నా సమాధానం చెప్పకుండా పారిపోవడానికి చూశారు. ఈ వీడియోలను టీడీపీ సోషల్ మీడియా మద్దతుదారులు బాగా వైరల్ చేసి.. అధికార పార్టీ బరితెగింపుకు ఇది నిదర్శనం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. న్యూట్రల్ నెటిజన్లు కూడా ఇదేం విడ్డూరం అంటూ ఆశ్చర్యపోతున్నారు.