జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. వారాహి విజయయాత్ర పేరుతో నిర్వహిస్తున్న సభల్లో ఆయన మాట్లాడుతున్న మాటల్ని చూస్తుంటే… తేడా ఇట్టే తెలిసిపోతోంది. గతంలో మాటకు మాటకు మధ్యలో కొంత మింగేసేవారు. మాటల్ని స్కిప్ చేసేవారు. ప్రస్తావిస్తున్న అంశాల్ని హటాత్తుగా వదిలేసి.. వేరే టాపిక్ లోకి వెళ్లేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చెప్పాలనుకున్న విషయాల్ని సూటిగా చెప్పేస్తున్నారు.
గతంలో మాదిరి వివిధ అంశాల మీద ఆయన మాటలు ఒకేలా స్థిరంగా ఉంటున్నాయి. ఒకప్పుడు కన్ఫ్యూజన్ మాస్టర్ గా ఉన్న పవన్ ను ఇప్పుడు క్లారిటీ కింగ్ గా అభివర్ణిస్తున్నారు. ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే ఏం చేస్తామన్న విషయాల్ని సూటిగా చెప్పేస్తున్న పవన్.. కొన్ని అంశాలపై తన వాదనను వివరంగా చెబుతున్నారు.
ముఖ్యమంత్రి జగన్ పై విమర్శల ఘాటు పెంచిన పవన్.. రెండు రోజులకు ఒకసారి నిర్వహించే బహిరంగ సభలకు కొత్త అస్త్రాల్ని సమకూర్చుకుంటున్నారు. తాను మాట్లాడే అంశాలు గతంలో మాట్లాడినవే అయితే బోర్ ఫీల్ అవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాజీ మంత్రి వివేకా హత్యపై గడిచిన సభలకు భిన్నంగా అమలాపురం సభలో పవన్ మాటలు ఉన్నాయి.
‘‘సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే ఆ హత్యను కవర్ చేయడానికి ముందు గుండెపోటు నాటకం ఆడారు. తరువాత విషయం బయటకు పొక్కడంతో ఎవరో చంపారని చెప్పారు. నిజం బయటకొస్తుందనే భయంతో ఒక వ్యక్తిని చంపేశారు. విచారణ చేయడానికి వచ్చిన సీబీఐ అధికారులను బెదిరించారు. హత్యకు సంబంధించిన కీలక వ్యక్తిని అరెస్టు చేద్దాం అంటే అడ్డుకున్నారు’’ అని నేరుగా క్లారిటీగా చెప్పారు.
జగన్ పై విమర్శల ఘాటు పెంచేసిన పవన్.. గత ఎన్నికల్లో జగన్ నోటి నుంచి వచ్చిన ‘ఒక్క ఛాన్స్ ’తో ఎన్ని దారుణాలకు పాల్పడ్డారో తెలుసా అంటూ చిట్టా విప్పారు. పవన్ మాటల్లో చూస్తే.. ‘‘2019లో తనకు అవకాశం ఇవ్వాలని పదేపదే కోరిన జగన్ రెడ్డి మాటలను ప్రజలు సంపూర్ణంగా నమ్మారు. ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి… ఉద్యోగాల క్యాలెండర్ పేరుతో మోసం… రైతులకు కనీస మద్దతు ధర ఇస్తామని ద్రోహం… దళితులకు సంబంధించిన 23 పథకాలు తీసేసి కుతంత్రం చేశారు. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రంలో 23 వేల మహిళలు అదృశ్యం అయ్యారు.
ఒక్క అవకాశం ఇస్తే ఒకటో తారీఖున జీతాలు లేకుండా చేశాడు.. ఒక్క అవకాశం పుణ్యమా అని అందరి మధ్య గొడవలు లేపాడు. సొంత చిన్నాన్నను చంపిన వారిని పట్టుకోకుండా, ఆయన కూతురిపై నెపం నెట్టే ఆలోచన చేశాడు. ఇలా ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి ఎన్నో ఘోరాలు.. ఇంకెన్నో కష్టాలు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొవల్సి వచ్చింది’’ అంటూ క్లారిటీ ఇచ్చేశారు. పవన్ ప్రసంగాల్ని చూస్తే.. కన్ఫ్యూజ్ కాదు క్లారిటీ వచ్చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.