చీరాల వైసీపీలో మళ్లీ ఎమ్మెల్యే కరణం బలరాం, పర్చూరు వైసీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు కొట్టుకున్నారు. సోషల్ మీడియాలో పరస్పర విమర్శలతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో పేరాల కూడలిలో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఆమంచి వర్గానికి చెందిన కౌన్సిలర్ సత్యానందంకు గాయాలయ్యాయి. దీంతో ఆయనను చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి దగ్గర కూడా రెండు వర్గాలు దాడులు చేసుకున్నాయి. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినా ఉద్రిక్తంగానే ఉండటంతో బందోబస్తు కొనసాగిస్తున్నారు. విషయం పార్టీ అధిష్ఠానం వరకు చేరినట్లుగా చెప్తున్నారు.
చీరాల బేస్డ్ లీడర్ అయిన ఆమంచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి అక్కడ ఓటమి పాలయ్యాయి. అక్కడ టీడీపీ నుంచి కరణం బలరాం పోటీ చేయడంతో ఆమంచికి ఓటమి తప్పలేదు. అయితే…. తరువాత తరువాత కరణం బలరాం కూడా వైసీపీలో చేరడంతో ఆ రెండు కత్తులూ ఒకే ఒరలో ఇమడలేక నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు జరిగినా అవేమీ ఫలించడం లేదు.
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాజకీయాలు చేసిన ఆమంచి.. రోశయ్య మరణం తరువాత 2009 తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన నవోదయం పేరుతో పార్టీ ఏర్పాటుచేసుకుని 2014 ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లోనూ ఆయన గెలిచారు. గెలిచిన కొద్ది నెలల్లోనే ఆయన టీడీపీలో చేరారు. అయితే… 2019 ఎన్నికల నాటికి టీడీపీ పరిస్థితి బాగులేదని గ్రహించిన ఆయన వైసీపీలో చేరారు. కానీ, వైసీపీ నుంచి పోటీ చేసినా ఆయన ఓటమిపాలయ్యారు.
ఆయనపై చీరాలలో గెలిచిన కరణం బలరాం కూడా వైసీపీలో చేరిపోవడంతో ఆమంచికి నియోజకవర్గంలో, వైసీపీలో కష్టాలు మొదలయ్యాయి. కరణం బలరాం చీరాలలో పాగా వేసి రానున్న ఎన్నికల్లో తన కుమారుడికి అక్కడి నుంచి టికెట్ ఇచ్చేలా అధిష్ఠానం నుంచి మాట తీసుకోవడంతో ఆమంచి నియోజకవర్గం మారాల్సిన పరిస్థితి వచ్చింది. పర్చూరు నుంచి పోటీ చేయాలని పార్టీ ఆయకు సూచిస్తోంది. అందుకే ఆయన్ను పర్చూరు ఇంచార్జిగానూ నియమించింది. కానీ.. ఆమంచి ఇప్పటికీ చీరాల నుంచే పోటీ చేయాలనే గట్టి ప్రయత్నం చేస్తుండడంతో బలరాం వర్గం నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది.
చీరాలలో ఆమంచి, కరణం వర్గాలకు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఆమంచి, కరణం బలరాంలను జగన్ గతంలో పిలిచి మాట్లాడినా పరిస్థితి మారలేదు. జగన్ మాట కాదనలేక ఆయన పర్చూరు ఇంచార్జిగా ఉండేందుకు అంగీకరించినా ఆ నియోజకవర్గం రకంటే చీరాలలోనే ఎక్కువగా పాలిటిక్స్ చేస్తున్నారు. పర్చూరులో కమ్మ వర్గం రాజకీయ ప్రాబల్యం ఎక్కువ ఉండడంతో ఆమంచికి ఆ నియోజకవర్గంపై ఏమాత్రం ఆసక్తి లేదు.